Paleti Rama Rao : సాధారణంగా పుట్టిన రోజు, పెళ్లిళ్లు, గృహప్రవేశాల వంటి వేడుకలకు ఆహ్వాన పత్రికలతో దగ్గరి వారిని ఆహ్వానిస్తుంటారు. అయితే.. బతికి ఉండగానే ఎవరైనా మరణ దిన వేడుకలు జరుపుకుంటారా..? తాను ఫలానా సంవత్సరం ఫలానా తేదీన చనిపోతానని.. ఆ రోజున ఏటా వేడుక చేసుకోవాలని ఓ వ్యక్తి నిర్ణయించుకున్నాడు. ఆహ్వాన పత్రికలు ముద్రించాడు. బంధు, మిత్రులను ఆహ్వానిస్తున్నాడు. ఈ ఆహ్వాన పత్రికలు చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చీరాలలో చర్చానీయాంశమైంది. ఆయన మరెవరో కాదు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాలేటి రామారావు.
ఆహ్వాన లేఖలో ఏం రాశారంటే.. “ప్రతి సంవత్సరం జరుపుకునే పుట్టినరోజు వేడుకలు అర్థరహితం అని తెలుసుకున్నా. అందుకే ఇకపై మరణదిన వేడుకలు జరుపుకోవాలని భావిస్తున్నా. ఇన్నాళ్ల నా జీవితాన్ని పరిశీలించుకున్నాక నా మరణ సంవత్సరాన్ని 2034 గా నిర్ణయించుకున్నా. దానికి ఇంకా 12 సంవత్సరాలు ఉంది. ఇప్పటి నుంచి ప్రతీ సంవత్సరం మరణదిన వేడుకలు జరుపుకుంటాను. ఆ వేడుకలకు మీరు హాజరై, నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ఇట్లు మీ పాలేటి రామారావు” అంటూ ఆ లేఖలో ఉంది.
1994, 1999లో టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు పాలేటి రామారావు. మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2004లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడి పోయారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ తరువాత వైసీపీలో చేరారు.