Health Education in Schools : “ఆరోగ్యమే మహాభాగ్యం” అనేది కేవలం సామెతగా మిగిలిపోకూడదు.. అది జీవన విధానంగా మారాలి. అప్పుడే ‘ఆరోగ్యాంధ్రప్రదేశ్’ స్వప్నం సాకారమవుతుంది. దీనికి పునాది ఎక్కడ పడాలి? ఇంకెక్కడ.. బడిలోనే! అవును, పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు చదువుతో పాటు ఆరోగ్య పాఠాలు కూడా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. యోగా, నేచురోపతి ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణరాజు ఇదే విషయాన్ని ప్రభుత్వానికి బలంగా నివేదించారు. అమరావతి కరకట్టపై జరిగిన ఉన్నతాధికారుల కీలక భేటీలో పలు ఆసక్తికర నిర్ణయాలు, చర్చలు జరిగాయి.
అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన: మంతెన ఆశ్రమంలో కీలక భేటీ : అమరావతి కరకట్టపై ఉన్న మంతెన సత్యనారాయణరాజు ఆరోగ్యాలయం బుధవారం ఒక కీలక సమావేశానికి వేదికైంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం ఆశ్రమాన్ని సందర్శించింది. ఈ బృందంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రధరబాబు, ఆయుష్ కమిషనర్ దినేష్ కుమార్, ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్టు డైరెక్టర్ నీలకంఠారెడ్డి తదితరులు ఉన్నారు. ఆశ్రమంలోని వాతావరణం, అక్కడ అనుసరిస్తున్న చికిత్సా విధానాలు, కార్యకలాపాల పట్ల అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
సిలబస్‌లో ఆరోగ్యం: రోజుకు 45 నిమిషాలు కేటాయించాల్సిందే : ‘యోగా- నేచురోపతి ద్వారా ప్రజల ఆరోగ్య సంరక్షణ’ అనే అంశంపై మంతెన సత్యనారాయణరాజు అధికారులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే పాఠశాల స్థాయి నుంచే మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు.
యోగా & ధ్యానం: పాఠశాల టైమ్ టేబుల్‌లో ప్రతిరోజూ 30 నిమిషాల యోగాభ్యాసం, 15 నిమిషాల ధ్యానం తప్పనిసరిగా చేర్చాలని సూచించారు.
ఆహారపు అలవాట్లు: మిల్లెట్ (చిరుధాన్యాలు) ఆధారిత, ప్రొటీన్ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.
సంపూర్ణ సహకారం: రాష్ట్రంలో యోగా, నేచురోపతిపై అవగాహన పెంచేందుకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని మంతెన స్పష్టం చేశారు.
అమరావతిలో ‘నేచురోపతి యూనివర్సిటీ’ : మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వైద్యారోగ్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలు ఆసుపత్రుల పాలవ్వడం కంటే.. ముందస్తు జాగ్రత్తలతో అనారోగ్యాన్ని దరిచేరనివ్వకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. ఈ క్రమంలోనే అమరావతి పరిధిలో ప్రతిష్టాత్మకమైన ‘నేచురోపతి యూనివర్సిటీ’ ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
యోగా ప్రచార పరిషత్: యోగా, ప్రకృతి వైద్యాన్ని గ్రామగ్రామాన విస్తరించేందుకు ‘యోగా ప్రచార పరిషత్’ను ఏర్పాటు చేయనున్నారు.
రీజనల్ సెంటర్లు: రాష్ట్రంలో మూడు రీజనల్ స్టడీ సెంటర్లలో 64 మంది సిబ్బందిని నియమించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
జనరిక్ మందులు – ఉపాధికి బాటలు : పేదలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రతి మండలంలో ‘జనరిక్ మందుల షాపులు’ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, యువతకు ఉపాధి కల్పించేలా లైసెన్సులు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. దీనివల్ల తక్కువ ధరకే మందులు లభించడంతో పాటు, నిరుద్యోగ యువతకు ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

