దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఏపీలో సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి తీసుకుని వచ్చిన వలంటీర్ల వ్యవస్థలో ప్రజలకు అందించిన సేవలు మరువ లేనివని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని రాంపురం గ్రామంలో ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వాలంటీర్లను చూస్తే చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడతాయని ఆరోపించారు. కాబట్టే వాలంటీర్లపై చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతలతో పాటు దత్తపుత్రుడి నోట్లో నుంచి కించపరిచే మాటలు వినపడుతున్నాయన్నారు ఎమ్మెల్యే.
వాలంటీర్లపై అక్కసు వెళ్లగక్కుతూ… నోటికొచ్చినట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. వాలంటీర్లను ఉగ్రవాదులు, జిహాదీలు, స్లీపర్ సెల్స్‌తో పోల్చుతూ అత్యంత అవమానకరంగా మాట్లాడుతూ.. వాలంటీర్ల ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
వాలంటీర్లు రూ.5వేల రూపాయిల గౌరవ వేతనంతో సమాజంలో నిస్వార్ధంగా సేవ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కోవిడ్ మహమ్మారి టైంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ నేతలు వాళ్ల హాయిగా నిద్రపోతూ ఇళ్లకే పరిమితమైతే… ఇదే వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకూ సేవలందించారంటూ గతాన్ని గుర్తుచేశారు. అంత గొప్ప సేవ చేసిన వీరిపై టీడీపీ నేతలు ఈ రకంగా మాట్లాడ్డం సిగ్గుచేటన్నారు. వాలంటీర్లపై అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు తమ వ్యాఖ్యలను కచ్చితంగా వెనక్కి తీసుకోవడంతో పాటు వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి డిమాండ్ చేశారు.