Mauritius PM : భారత్ పర్యటనలో ఉన్న మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్‌గూలం సోమవారం సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మారిషస్ ప్రధాని పర్యటన నేపథ్యంలో టీటీడీ అధికారులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం తిరుమలకు చేరుకున్న ప్రధాని దంపతులకు శ్రీవారి మహాద్వారం వద్ద టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ ఏకే సింఘాల్, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ప్రధాని వెంట ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు.
శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ప్రధాని నవీన్ చంద్ర దంపతులకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం మంత్రి ఆనం, టీటీడీ ఛైర్మన్, ఈఓలు వారికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు, పట్టు వస్త్రాలు, చిత్రపటాన్ని అందజేశారు. ప్రధాని నవీన్ చంద్ర శ్రీవారిని దర్శించుకోవడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మిక సంస్కృతి, సంప్రదాయాల పట్ల తమకు ఉన్న గౌరవం ఈ పర్యటన ద్వారా మరింత పెరిగిందని ఆయన పేర్కొన్నారు.
మారిషస్ ప్రధాని సెప్టెంబర్ 9న భారత్ పర్యటనకు విచ్చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారతదేశం మారిషస్‌కు రూ. 5,984 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. అంతేకాకుండా, తీర ప్రాంత భద్రత, సాంస్కృతిక సంబంధాలు, ఆర్థిక సహకారం వంటి ఏడు కీలక ఒప్పందాలను ఇరు దేశాలు కుదుర్చుకున్నాయి. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య మైత్రీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని నవీన్ చంద్ర పర్యటన ఈ నెల 16న ముగియనుంది. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల సందర్శనతో ఆయన పర్యటనకు ఒక సరికొత్త ఆధ్యాత్మిక కోణం తోడైంది.


