AP Mega DSC 2025 Recruitment Rally : మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియపై జరుగుతున్న నిరాధార ఆరోపణలను ఖండిస్తూ.. ఇచ్చిన హామీని నెరవేర్చిన ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు నిరుద్యోగ ఉపాధ్యాయ లోకం కదలివచ్చింది. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి శనివారం ఉదయం బయల్దేరిన ప్రత్యేక ఆత్మగౌరవ సైన్యం చారిత్రాత్మక కర్నూలు కొండారెడ్డి బురుజు వైపు అడుగులు వేసింది.
ప్రొద్దుటూరులో జెండా ఊపి సాగనంపిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి : మెగా డీఎస్సీ-2025 నియామకాల సత్యసంధతను చాటి చెప్పేందుకు ‘ఛలో కర్నూల్’ పిలుపులో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి 42 మంది మెగా డీఎస్సీ అభ్యర్థుల బృందం కర్నూలుకు పయనమైంది. ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి ఆశీస్సులు, ఆధ్వర్యంలో ఈ యాత్ర ఉత్సాహంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్ సమన్వయకర్తగా (కోఆర్డినేటర్) వ్యవహరించి అభ్యర్థుల ప్రయాణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వై.యస్. జబీవుల్లా ఈ కార్యక్రమంలో పాల్గొని అభ్యర్థులకు పూర్తి సంఘీభావం ప్రకటించారు. పారదర్శకంగా జరిగిన నియామక ప్రక్రియపై కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న అసత్య ప్రచారాలను ఎండగట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాయకులు పిలుపునిచ్చారు.
కొండారెడ్డి బురుజు వేదికగా సత్య శోధన : రాయలసీమ పౌరుషానికి ప్రతీకగా నిలిచే కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద శనివారం భారీ ఎత్తున ‘మెగా డీఎస్సీ-2025 ఆత్మగౌరవ ర్యాలీ’ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వస్తున్న అభ్యర్థులతో కలిసి ప్రొద్దుటూరు బృందం ఈ ఆందోళనలో భాగస్వామ్యం కానుంది.
అభ్యర్థుల ప్రధాన డిమాండ్లు & ఆవేదన: మెగా డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ప్రతిభ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ సాగిందని స్పష్టం చేయడం. దశాబ్ద కాలంగా నిరీక్షిస్తున్న వేలాది మంది అభ్యర్థులకు ఒకేసారి 16,347 ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు తెలపడం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ, రాజకీయ ప్రయోజనాల కోసం భ్రమలు కల్పించే శక్తుల కుట్రలను తిప్పికొట్టడం.

