భవన నిర్మాణ సంక్షేమ బోర్డును కాపాడాలని కోరుతూ బేతంచర్ల లో భారీ ర్యాలీ ధర్నాచేసి, అనంతరం ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీ బిల్డింగ్ & అదర్ కన్ స్ట్రక్ షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి v. బాల వెంకట్ (సిఐటియు ), జిల్లా ఉపాధ్యక్షులు వై ఎల్లయ్య, సిఐటియు జిల్లా నాయకులు వైబి వెంకటేశ్వర్లు ధర్నాలో మాట్లాడుతూ, భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా కార్డు పొందిన ప్రతి కార్మికునికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కార్మికులకు శాంక్షన్ అయిన పథకాలను ఆపివేసి, బోర్డును నిర్వీర్యం చేయటానికి ప్రయత్నిస్తోందన్నారు. కార్మికులకు చట్టబద్ధంగా చెందాల్సిన పథకాలు రాయితీలను అందించకుండా, సంక్షేమ బోర్డు నిధులు 1280 కోట్ల రూపాయలు ప్రభుత్వ అవసరాలకు వాడుకొని, కార్మికులకు మొండి చేయి చూపించిందని అన్నారు.
సంక్షేమ బోర్డు పథకాలు విషయంపై ప్రభుత్వానికి అనేకసార్లు మొరపెట్టుకున్నా ఏమాత్రం ఖాతరు చేయకుండా కార్మికులను నిర్బంధానికి గురిచేసి, కార్మికులను అరెస్టులు చేశారని ఆరోపించారు. టిడిపి హయాంలో భవన నిర్మాణ కార్మికుల పోరాటాలకు మద్దతు ఇచ్చిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన వైఖరిని ఆవలంభించడం ఎంతవరకు సబబని, ప్రభుత్వం పునరాలోచించాలని,పెండింగ్ క్లెములను విడుదల చేయాలని, ప్రభుత్వం వాడుకున్న సంక్షేమ బోర్డు నిధులను తిరిగి బోర్డుకి జమ చేయాలని, భవన నిర్మాణ కార్మికుడికి 60 సంవత్సరాలు వచ్చేంత వరకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తదనంతరం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిని కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు బాలయ్య ఎస్ కే భాష, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు రషీద్, సమోసా వలి, మాసూం వలి, షేక్ షా, కుమార్, ప్రభాకర్, మా భాష, కైప భాష, మక్బుల్, గోపాల్ తో పాటు 200 మంది భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.