AP: శ్రీకాకుళం జిల్లాలో 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన సిఎన్‌జి గ్యాస్ పంప్‌ను రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ హయంలో ప్రజలు తన అభిప్రాయాలను వెల్లడించేందుకు కూడా అవకాశాలు లేకపోయాయని, అప్పటి పాలనలో హౌస్ అరెస్టులు ఎక్కువగా జరిగాయని గుర్తు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజల అభ్యంతరాలను స్వేచ్ఛగా వినేందుకు తలుపులు తెరిచిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం ప్రజలతో నేరుగా మాట్లాడే వాతావరణాన్ని కల్పించిందని మంత్రి పేర్కొన్నారు.
“జగన్ ఇక ప్రతిపక్ష నేత కాదు”
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జగన్ ఒక పార్టీ అధ్యక్షుడు. అలాగే ఒక నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నారని, ఆయనకు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర లేదని అన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొందరి ఆత్మహత్యలు, మాదకద్రవ్యాల వినియోగంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జగన్ విమర్శించడం ఆశ్చర్యకరమని చెప్పారు. “ఒకవేళ లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే దాన్ని సమర్థించేది కాదు. కానీ, సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే వాటిని తప్పుబట్టడమేంటి?” అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయంలో జరిగిన ఘటనలపై చర్చిస్తూ, ఓ వ్యక్తి ముఖ్యమంత్రి కారు కింద పడి మరణించినప్పుడు కూడా స్పందన లేకపోవడం అనాగరికంగా ఉందని విమర్శించారు. “జగన్‌లో మానవత్వం ఉందా? ఆయనకు రాష్ట్ర రాజకీయాల్లో ఉండే నైతిక హక్కు ఉందా?” అంటూ అచ్చెన్నాయుడు నిలదీశారు.