Sunday, February 8, 2026
Homeఆంధ్రప్రదేశ్Minister Anam : జగన్‌పై మంత్రి ఆనం నిప్పులు: "సర్వే రాళ్ల పేరుతో రూ. 675...

Minister Anam : జగన్‌పై మంత్రి ఆనం నిప్పులు: “సర్వే రాళ్ల పేరుతో రూ. 675 కోట్ల దోపిడీ.. భూములపై రైతులకే సర్వహక్కులు!”

Minister Anam Slams Jagan: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో భూ యజమానుల హక్కులను కాలరాసేలా తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం రైతుల పాలిట శాపంగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. ఆదివారం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ , అభివృద్ధి పనుల శంకుస్థాపనలో పాల్గొన్న మంత్రి, అనంతరం మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

భూముల దోపిడీకి కుట్ర ..
గత ప్రభుత్వం రైతుల పాసుపుస్తకాలపై జగన్ బొమ్మ వేయించుకుందని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని తొలగించి, గౌరవప్రదంగా ప్రభుత్వ రాజముద్ర ఉన్న పాసుపుస్తకాలను రైతులకు అందిస్తున్నామని ఆనం తెలిపారు. భూ సర్వే పేరుతో సరిహద్దు రాళ్లపై జగన్ బొమ్మలు వేసి ఏకంగా 675 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృథా చేశారని, అది ముమ్మాటికీ దోపిడీయేనని ఆరోపించారు. ఈ వివాదాస్పద చట్టం ద్వారా రైతుల భూములను కబ్జా చేసేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నారని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసి రైతుల ఆస్తులకు భద్రత కల్పించారని గుర్తుచేశారు.

ఆర్థిక భారంపై విమర్శలు
విద్యుత్ రంగంలో వైసీపీ చేసిన తప్పిదాల వల్ల సామాన్యులపై పెను భారం పడిందని మంత్రి మండిపడ్డారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల నుంచి దాదాపు 32 వేల కోట్ల రూపాయలను వైసీపీ ప్రభుత్వం దోచుకుందని ఆయన విమర్శించారు.

మెట్ట ప్రాంత రైతులకు భరోసా:
నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన సోమశిల హై లెవెల్ కెనాల్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం నీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం నిధులను కేటాయించి మెట్ట భూములకు సాగునీరు అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News