Thursday, July 17, 2025
Homeఆంధ్రప్రదేశ్Pothireddypadu: తెలంగాణపై ఏపీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు!

Pothireddypadu: తెలంగాణపై ఏపీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు!

Janardhan Reddy: ఏపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాంతంలో కీలకంగా భావించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాజెక్టు పనితీరు, నీటి వినియోగ పరిస్థితులపై పరిశీలనలు చేపట్టారు. ఈ క్రమంలో కొన్ని కీలక అంశాలను స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా కేవలం సముద్రంలో కలసిపోతున్న మిగులు జలాలను మాత్రమే వినియోగిస్తున్నామని మంత్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వంతో పాటు కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే తప్పుదారి పట్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇది పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం నడిపిస్తున్న నాటకమని ఆయన ధ్వజమెత్తారు.

- Advertisement -

“ప్రస్తుతం వృథాగా సముద్రంలో కలిసిపోతున్న నీటి శాతంపై స్పష్టమైన లెక్కలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉన్నాయి. ఆయనే ఆ ఆధారాలతో పని చేస్తున్నారు” అని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి చెరువు, ప్రతి రిజర్వాయర్ నీటితో నిండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నారు అని మంత్రి చెప్పారు. అందుకోసం అన్ని వనరులను సమర్థవంతంగా వినియోగించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని తెలిపారు.

అలగనూరు రిజర్వాయర్ అభివృద్ధి ప్రణాళికపై కూడా మంత్రి స్పందించారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యమే ఈ రిజర్వాయర్ పరిస్థితికి కారణమని ఆయన విమర్శించారు. “కేవలం 25 కోట్ల రూపాయలతో పనులు పూర్తయ్యే స్థితిలో ఉండగా, నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు దాదాపు ₹100 కోట్ల ఖర్చుతోనైనా సమర్థవంతంగా పూర్తిచేయాల్సిన అవసరం ఏర్పడింది,” అని మంత్రి వివరించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో నిజాలను దాచిపెట్టి రాజకీయ లబ్ధి కోసం తప్పుదారి పట్టించడాన్ని సహించబోమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత పూర్తిగా నీటి పరిరక్షణ, వినియోగం, రైతులకు మేలు చేసే విధంగా నీటి ప్రణాళికలపై దృష్టి సారించడం అని తెలిపారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News