కర్నూల్ లో హైకోర్టు కట్టితీరుతామని ఏపీ మంత్రి బుగ్గజన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. సోమవారం కర్నూల్ ఎస్టీబీసీ కాలేజీ మైదానంలో వైసీపీ ఆధ్వర్యంలో రాయలసీమ గర్జన సభ నిర్వహించారు. ఈ సభకు వైసీపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ బాషా, గుమ్మనూరు జయరాం, రాయలసీమ ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. కర్నూల్ లో ఖచ్చితంగా హైకోర్టు కట్టి తీరుతామని ధీమాగా చెప్పారు.
కర్నూల్ లో హైకోర్టును సాధించేంతవరకూ తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ఇక్కడి యువత, రైతాంగం, ప్రజల భవిష్యత్, గౌరవం కోసం హైకోర్టును తీసుకొచ్చే పోరాటం జరుగుతోందన్నారు. కర్నూల్లో 10 కిలోమీటర్ల దూరం వరకూ కనిపించేలా జగన్నాథగట్టుపై హైకోర్టు నిర్మాణానికి శ్రీకారం చుడతామన్నారు.
1956లో రాజధాని కర్నూల్ నుండి హైదరాబాద్ కు తరలిపోయిందని, అప్పటినుండి సీమ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదన్నారు మంత్రి బుగ్గన. ఒక పక్క అభివృద్ధి, హైకోర్టు గురించి మాట్లాడుతూనే.. మరో పక్క విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు.
సీఎం జగన్ హయాంలో.. మూడు రాజధానుల ప్రతిపాదనతో ఇప్పుడు సీమప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం వస్తే.. ప్రతిపక్షాలు ఎందుకు అడ్డుకుంటున్నాయని ప్రశ్నించారు. అలాగే కర్నూల్ లో హైకోర్టును ఏర్పాటు చేయడం చంద్రబాబుకు ఇష్టముందో లేదో చెప్పాలని మంత్రి బుగ్గన డిమాండ్ చేశారు. ఏపీలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్ ఆశయమని వెల్లడించారు.