Homeఆంధ్రప్రదేశ్Rayachoti: హింసాత్మక ఘటనలపై మంత్రి మండిపల్లి ఆగ్రహం

Rayachoti: హింసాత్మక ఘటనలపై మంత్రి మండిపల్లి ఆగ్రహం

* దాడులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

* టీడీపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో డిమాండ్‌

రాయచోటి, తెలుగు ప్రభ :స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాయచోటిలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయచోటిలోని ఎస్‌ఎన్‌ కాలనీలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాల్సిన సమయంలో దాడులు, బెదిరింపులకు పాల్పడటం ఆందోళనకరమని పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎన్నికల పరిస్థితులు ఒకలా ఉంటే, అన్నమయ్య జిల్లా రాయచోటిలో మాత్రం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి వ్యాఖ్యానించారు.

రాయచోటిలో వైసీపీ నేతలు హింసాత్మక రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనుచరులు బెంగళూరు, బీహార్ ప్రాంతాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి టీడీపీ కార్యకర్తలపై వాహనంతో దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనలో దేవుడి దయవల్ల ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఆత్మరక్షణ కోసం నిలబడిన టీడీపీ కార్యకర్తలపైనే నిందలు వేయడం సరికాదని మంత్రి అన్నారు. గతంలో ఫ్యాక్షన్‌ ఆనవాళ్లు లేని ప్రాంతంలో హింసాత్మక రాజకీయ సంస్కృతిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాయచోటి, పుంగనూరులో చోటుచేసుకుంటున్న ఘటనల వెనుక వైసీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు.

పోలీసుల తనిఖీల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన అనుమానితులు పట్టుబడటం, ఆయుధాలు, బాంబులకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వస్తున్నాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు. వైసీపీ మున్సిపల్ అభ్యర్థికి సంబంధించిన వ్యక్తి అనుమానిత ముఠాలో పట్టుబడ్డారంటూ వస్తున్న ఆరోపణలపైనా పూర్తిస్థాయి విచారణ జరగాలని కోరారు.

దాడులు, బెదిరింపులకు దిగుతున్నారని…

ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కోలేక వైసీపీ నేతలు దాడులు, బెదిరింపులకు దిగుతున్నారని మంత్రి విమర్శించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని పార్టీ అధిష్ఠానం సూచించినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్‌, పోలీసు, న్యాయ వ్యవస్థలపై తమకు నమ్మకం ఉందని, ఘటనలకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

పుంగనూరులో అంగళ్లు ఘటన, ప్రొద్దుటూరులో సుబ్బయ్య హత్య కేసులను ప్రస్తావిస్తూ మంత్రి ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేశారు. గతంలో జరిగిన ఘటనలకు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలే తీర్పు చెబుతారని వ్యాఖ్యానించారు. పెద్దిరెడ్డి కుటుంబ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు దూరంగా ఉంటూ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అన్ని వర్గాలు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News