Nadendla Manohar| కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేస్తుందంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలకు మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. ఈమేరకు వివరాలతో సహా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
గత ప్రభుత్వ హయాంలో ఈ సమయానికి 4.43 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా.. కూటమి ప్రభుత్వం 9.14 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిందని ఆయన తెలిపారు. ధాన్యాన్ని సేకరించిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా జిల్లాల వారీగా 2023-24 సంవత్సరంలో సేకరించిన ధాన్యం, 2024-25 ఏడాదిలో సేకరించిన ధాన్యం వివరాలను ఆయన వెల్లడించారు.
కాగా ధాన్యం కొనకుండా రైతులను సీఎం చంద్రబాబు రోడ్డున పడేశారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. పంటలకు మద్దతు ధర ఏదీ? అంటూ నిలదీశారు. రోడ్లపైనే ధాన్యం ఉండిపోయిందని, కొనేవారేరీ? అని ప్రశ్నించారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలన్న కనీస ధ్యాస కూడా కూటమి ప్రభుత్వానికి లేకుండాపోయిందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నుంచి, అవసరమైన సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.