Project Punarvika by Nara Lokesh: రాష్ట్రంలో ఇకపై అరుదైన జన్యువ్యాధులతో బాధపడే చిన్నారులను ఆదుకునేందుకు ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. తెలుగు రాష్ట్రాల నుంచి దాతల సహకారంతో పాటు ప్రభుత్వం చొరవతో పునర్విక మరో జన్మని అందుకున్న విషయం తెలిసిందే. ప్రాణాపాయం నుంచి బయటపడిన ఆ చిన్నారి బోసినవ్వులను చూసి భావోద్వేగానికి లోనైన మంత్రి నారా లోకేశ్.. అలాంటి తరహా వ్యాధులతో ఇకపై ఏ చిన్నారి జీవితం ముగియకూడదని కీలక నిర్ణయం తీసుకున్నారు.
అరుదైన జన్యు వ్యాధులతో బాధపడే పిల్లల కోసం ‘ప్రాజెక్ట్ పునర్విక’ అనే కొత్త పథకాన్ని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. జన్యుపరమైన, అత్యంత ఖరీదైన చికిత్స అవసరమయ్యే అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లలను ఈ పథకం ద్వారా ఆదుకుంటారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్లలకు ఖరీదైన వైద్యం అందేలా ప్రభుత్వమే బాధ్యత తీసుకునేలా ఈ పథకాన్ని రూపొందించారు. చిన్నారి పునర్వికకు జరిగిన వైద్య సహాయం విజయవంతం కావడంతో ఈ పథకానికి ఆమె పేరునే నామకరణం చేయడం విశేషం.
కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక అనే పాప ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ’ అనే అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతుండగా, ఆమె చికిత్స కోసం రూ. 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరమైంది. దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్, ఆ పాపకు అవసరమైన సాయం అందిస్తానని మాట ఇచ్చారు. దీంతో సోషల్ మీడియా వేదికగా దాతల ద్వారా రూ. 10 కోట్లు సేకరించగా.. ప్రభుత్వం తరఫున రూ. 6 కోట్లు ఆర్థిక సహాయం అందించారు. ఫలితంగా శనివారం ఆ పాపకు ఇంజెక్షన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయింది. ఈ స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి వ్యాధులతో బాధపడే ఇతర పిల్లలను ఆదుకోవడానికి ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది.
పేద కుటుంబాల పిల్లలకు వైద్యం అందక ఇబ్బంది పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. అరుదైన వ్యాధుల బారిన పడిన ప్రతి బిడ్డను కాపాడుకోవడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని వెల్లడించారు.

