Lokesh On Teachers: ఆధునిక విద్యా మాధ్యమాలతో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తూ విద్యా రంగంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో ప్రజల్లో ఇంకా కొనసాగుతున్న సందేహాలను తొలగించేలా కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకున్నారు. తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో కాకుండా, తాము పనిచేస్తున్న లేదా సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించడం ద్వారా వారు నిజమైన మార్గదర్శకులుగా నిలిచారు. విద్యా రంగంపై ఈ ఆదర్శవంతమైన చర్యను రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసిస్తూ, ఉపాధ్యాయులకు తన అభినందనలు తెలిపారు.
“మీరు కోరే మార్పుకు, మీరు మొదలవ్వండి” – మంత్రి లోకేష్
‘‘ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పాలని పిలుపునిచ్చే ఉపాధ్యాయులు తమ పిల్లలకు కూడా అదే విద్యావ్యవస్థను అందించడమనేది నిజమైన నిబద్ధతకు ప్రతీక’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న విద్యా నాణ్యత ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోదని, పిల్లలు సాధిస్తున్న ఫలితాలే దానికి నిదర్శనమని ఆయన అన్నారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని:
జిన్నూరు జడ్పీ పాఠశాల స్కూల్ అసిస్టెంట్ బొంతు మధుబాబు
పంగిడిగూడెం ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు బాబూ రాజేంద్రప్రసాద్
సోమరాజుచెరువు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వీరవాసరపు బాలకరుణాకరరావు
ఈ ముగ్గురినీ మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఉపాధ్యాయుల ఈ ముందడుగు, ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసాన్ని మరింత పెంచేలా పనిచేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.