Nara Lokesh Russia Visit: ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ తన రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలో రష్యాకు చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్స్ సంస్థ ‘గిరెడ్‌మెట్’ ప్రతినిధులతో ఆదివారం కీలక భేటీ నిర్వహించారు. ఏపీకి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ చర్చల్లో రాష్ట్రంలో అరుదైన ఖనిజాల ప్రాసెసింగ్, రిఫైనింగ్ హబ్ ఏర్పాటుపై మంత్రి లోకేష్ సానుకూల ప్రతిపాదనలు చేశారు.
ఉత్తరాంధ్రలో రేర్ ఎర్త్ రిఫైనింగ్ హబ్: ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో అపారంగా లభించే భారీ ఖనిజ సంపదను వెలికితీయడంపై భేటీలో కీలకంగా చర్చించారు. ఈ వనరుల ఆధారంగా రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన ‘డీప్ ప్రాసెసింగ్ & రేర్ ఎర్త్ ఎలిమెంట్ (REE) రిఫైనింగ్ హబ్’ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని లోకేష్ గిరెడ్‌మెట్ సంస్థను విజ్ఞప్తి చేశారు.
నెల్లూరులో నియోడైమియం మాగ్నెట్ ప్లాంట్: దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్, పవన విద్యుత్ రంగాల అవసరాలను తీర్చడానికి ప్రత్యేక ప్లాంట్ ప్రతిపాదించారు. గిరెడ్‌మెట్ సంస్థకు ఉన్న అడ్వాన్స్డ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ సహాయంతో నెల్లూరులో ఫుల్-సైకిల్ రేర్-ఎర్త్ శాశ్వత అయస్కాంతాల తయారీ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు.
సెమీకండక్టర్ ల్యాబ్ & ఇతర సాంకేతికతలు: ఆంధ్రప్రదేశ్‌లో ‘మెటలర్జీ అల్ట్రా ప్యూర్ సెమీకండక్టర్ ల్యాబ్’ ఏర్పాటుకు చొరవ చూపాలని రష్యా ప్రతినిధులకు లోకేష్ వివరించారు. మైనింగ్ టెయిలింగ్స్, పారిశ్రామిక వ్యర్థాల నుంచి విలువైన లోహాలను వేరుచేసే రష్యన్ రీసైక్లింగ్ టెక్నాలజీపై కూడా మంత్రి ఆరా తీశారు. రష్యాలో జరుగుతున్న సదస్సుల్లో పాల్గొంటున్న మంత్రి లోకేష్, గిరెడ్‌మెట్ సంస్థతో సాంకేతిక భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ పారిశ్రామిక, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

