Minister Narayana Sensational Comments on Varma: ఏపీ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. తాజాగా మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇటీవల నెల్లూరు సిటీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. ఆయన ఆడియో లీక్ అవ్వడంతో ప్రస్తుతం ఇది తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఆడియోలో ఆయన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆడియో కాల్‌లో మంత్రి నారాయణ మాట్లాడుతూ.. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మను పూర్తిగా జీరో చేశామని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం పవన్ కళ్యాణ్ కోసమే వర్మను జీరో చేశామని ఆయన స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు, వర్మకు రోజూ ఏదో ఒక గొడవ జరుగుతుందని తెలిపారు.
పవన్ కోసం వర్మను జీరో చేశాం..
తనను జీరో చేశారని వర్మ గత నాలుగు నెలలుగా చెప్పుకుంటున్నారని మంత్రి నారాయణ పేర్కొన్నారు. పిఠాపురంలో వర్మ ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండాలని చంద్రబాబు స్వయంగా వార్నింగ్ ఇచ్చారని ఆడియోలో తెలిపారు. అంతేకాకుండా, జనసేన వాళ్లు పిలిస్తేనే వర్మ వెళ్లి మాట్లాడాలని, లేకుంటే నిశ్శబ్దంగా ఉండాలని, సీఎం నుంచి మాకు ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయని మంత్రి నారాయణ అన్నారు. పార్టీ ఇంటర్నల్ విషయాలపై ఏం మాట్లాడొద్దని, ఎవరైనా లైన్ మాట్లాడితే వ్యవహారం వేరేలా ఉంటుందని మంత్రి నారాయణ ఈ టెలీకాన్ఫరెన్స్‌లో నేతలకు సూచించారు. అయితే, లీకైన ఈ ఆడియో ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
పవన్ కళ్యాణ్ విజయం వెనుక వర్మ..
ఇదిలా ఉండగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ త్యాగం వల్ల ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ గెలిచారని ఇటీవల అంబటి రాంబాబు అన్నారు. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడటంతో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో వర్మ తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ నిర్ణయంపై ఆయన అనుచరులు అభ్యంతరం తెలిపారు. అయినా కూడా కూటమి, పవన్ గెలుపు కోసం వర్మ పోటీ చేయకుండా పవన్ కళ్యాణ్‌కు అవకాశం ఇచ్చారని, అతని త్యాగం వల్లే పవన్ గెలిచారని వర్మ అభిమానులు చెబుతున్నారు. సీటు త్యాగం చేయడం వల్ల ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ సైతం నెరవేరడం లేదని వాపోతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ గెలుపుపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ సొంతంగా గెలవలేదని.. బలమైన ఓటు బలం ఉన్న వర్మ త్యాగం వల్ల పిఠాపురంలో గెలిచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ విజయం వెనుక వర్మ ఉన్నారనే సత్యాన్ని అందరూ గ్రహించాలని కోరారు.


