అమరావతి(Amaravati) నిర్మాణంలో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో పాటు ఉన్నతాధికారుల బృందం గుజరాత్‌లో(Gujarath Tour) పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా రెండో రోజు గ్యాస్పూర్‌లో జిందాల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ సందర్శించింది. ఘన వ్యర్ధాల నుంచి విద్యుత్,పేవర్ బ్లాక్స్ తయారుచేసే విధానాన్ని పరిశీలించారు. ప్రతి రోజూ పెద్ద ఎత్తున వస్తున్న ఘన వ్యర్ధాలను డికంపోజ్ చేసే విధానాన్ని అక్కడి అధికారులు వివరించారు.

అనంతరం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంను పరిశీలించారు. కేవలం 9 నెలల్లోనే స్టేడియంను నిర్మించిన విధానాన్ని గుజరాత్ క్రీడల శాఖ అధికారులు వివరించారు. అమరావతిలో నిర్మించే స్పోర్ట్స్ సిటీలో భారీ క్రికెట్ స్టేడియం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. అహ్మదాబాద్ పర్యటన తర్వాత తిరిగి విజయవాడకు మంత్రి నారాయణ, అధికారులు బయలుదేరారు.

కాగా తొలి రోజైన ఆదివారం అమరావతిలో నిర్మించే భారీ విగ్రహాల కోసం ఏక్తా నగర్‌లో సర్దార్ వల్లభాయి పటేల్ భారీ విగ్రహాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో పటేల్ విగ్రహ నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతికతతో పాటు మెటీరియల్ ఇతర అంశాలను నిర్మాణ సంస్థ ప్రతినిధులు, గుజరాత్ ఉన్నతాధికారులు మంత్రి బృందానికి వివరించారు. ఈ బృందంలో మంత్రి నారాయణ,సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు, ఏడీసీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్థసారథి భాస్కర్, గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
