AP Road Accidents: రాష్ట్రంలో కర్నూలు, మార్కాపురం, మారేడుమిల్లి ప్రమాదాలకు మానవ తప్పిదమే కారణమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు చేపట్టారు. బస్సుల్లో ప్రమాదాల నివారణపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరై ఇక్కడ నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను సీజ్ చేశామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా 16 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పది రోజుల్లో పదివేల వాహనాలను తనిఖీ చేశామని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ వాహనాలను ఆదేశించామన్నారు. త్వరలో బస్సుల్లో సీట్ల టాక్సేషన్ తగ్గించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు.
Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/bomb-threat-to-all-india-radio-and-kukatpally-jntu/
‘రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి, డ్రైవర్ల పనితీరును పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏఐ సాంకేతికతను అందుబాటులోకి తెస్తోంది. బస్సు డ్రైవర్ల ఏకాగ్రత, అలసట, నిద్ర మత్తును గుర్తించేందుకు అన్ని బస్సుల్లో ఏఐ ఆధారిత కెమెరాలు ఏర్పాటు చేయనున్నాం. జాతీయ, రాష్ట్ర రహదారులపై అతివేగాన్ని అరికట్టేందుకు రూ. 40 కోట్లతో స్పీడ్ గన్ల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీని కోసం త్వరలో టెండర్లు పిలవనున్నాం. 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే బస్సుల్లో తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. స్లీపర్ కోచ్ బస్సుల్లో ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉన్నందున, వాటిని రద్దు చేసే అంశంపై కేంద్రానికి లేఖ రాశాం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సమయపాలన పాటించకపోతే నగరం వెలుపలే నిలిపివేస్తాం. ప్రమాదాలకు కారణమైన వారిపై రాజకీయ ప్రమేయం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

