Rapthadu: రాప్తాడు ఉన్మాది దాడిలో గాయపడిన బాధితురాలు గోపిక ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శుభవార్త తెలిపారు. గోపిక ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగుపడుతోందని ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోపికకు ఇటీవల నిర్వహించిన కుడి భుజం శస్త్రచికిత్స విజయవంతమైంది. గోపిక కోలుకుంటున్న తీరు ఆశాజనకంగా ఉందని వైద్యులు తెలిపారు.
గోపిక మంచం నుంచి లేచి కుర్చీలో కూర్చుంటోందని.. అంతేకాకుండా స్వయంగా నిలబడేందుకు, నడిచేందుకు కూడా ఆసక్తి చూపుతోందని వైద్యులు తెలిపారు. ఆమె శ్వాసక్రియ, రక్త ప్రసరణ వ్యవస్థలు పూర్తిగా సాధారణ స్థితిలోనే ఉన్నాయని ధ్రువీకరించారు. ఆమె నోటి ద్వారా ఆహారం తీసుకోవడం ప్రారంభించిందని.. నొప్పి తీవ్రతను తగ్గించేందుకు, త్వరగా కోలుకోవడానికి ఐవీ (IV) ద్వారా అవసరమైన మందులు, నొప్పి నివారణ చికిత్సను అందిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

