Wednesday, February 11, 2026
Homeఆంధ్రప్రదేశ్Satyakumar: జైలుకు జగన్ ఖాయం.. కోర్టు విచారణను బల ప్రదర్శనగా మార్చారంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్...

Satyakumar: జైలుకు జగన్ ఖాయం.. కోర్టు విచారణను బల ప్రదర్శనగా మార్చారంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర విమర్శలు

Minister Satyakumar:  అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరైన వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆరేళ్ల విరామం తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టు మెట్లు ఎక్కుతూ, భారీ బల ప్రదర్శనకు దిగడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయంగా దిగజారడం వల్లే జగన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు.

- Advertisement -

బల ప్రదర్శన వెనుక కుట్ర?
కోర్టుకు హాజరయ్యే క్రమంలో హైదరాబాద్‌లో జగన్ సృష్టించిన హంగామాను సత్యకుమార్ తీవ్రంగా ఖండించారు. తాను కోర్టుకు వస్తే శాంతిభద్రతలకు సమస్యలు వస్తాయని న్యాయస్థానాన్ని నమ్మించడానికి, అలాగే ప్రజాబలం ఇంకా ఉందని చెప్పుకోవడానికి ముందస్తు ప్రణాళికతోనే ఈ ర్యాలీ నిర్వహించారని ఆరోపించారు.

“న్యాయ విచారణలో భాగంగా కోర్టుకు హాజరయ్యేవారు ఎప్పుడూ వినయంగా, పశ్చాత్తాపంతో వ్యవహరిస్తారు. కానీ జగన్‌లో ఆ పశ్చాత్తాపం మచ్చుకైనా కనిపించడం లేదు. పెయిడ్ ఆర్టిస్టులతో ర్యాలీ నిర్వహించి, హైదరాబాద్ వాసులకు తీవ్ర ఇబ్బందులు కలిగించడం ఆయన రాజకీయ అహంకారానికి పరాకాష్ట అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్రమాల పర్వం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు సంపాదించారని సత్యకుమార్ పునరుద్ఘాటించారు. ఈ అక్రమాలకు సంబంధించిన సీబీఐ, ఈడీ కేసులు ఇప్పటికే సుప్రీంకోర్టు పరిధిలో విచారణకు సిద్ధమవుతున్నాయని, కాబట్టి కోర్టు కేసుల నుంచి తప్పించుకుని జగన్ ఎంతోకాలం బయట తిరగలేరని ఆయన స్పష్టం చేశారు.

న్యాయం, ధర్మం ఎప్పటికైనా గెలుస్తాయని పేర్కొన్న మంత్రి, తమ తప్పులను పశ్చాత్తాపంతో అంగీకరించకుండా, అధికారాన్ని అడ్డుపెట్టుకుని న్యాయవ్యవస్థను ప్రభావితం చేయాలని చూసే వారికి జైలు శిక్ష ఖాయమని ఘంటాపథంగా చెప్పారు. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదని, చట్టం ముందు అందరూ సమానమేనని ఈ కేసు నిరూపిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News