ఆధ్యాత్మికతకు, సంప్రదాయాలకు కుంభమేళాలు పునాదులని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అభిప్రాయపడ్డారు. మహా కుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదని, కోట్లాదిమంది భారతీయుల సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అని తెలిపారు.
మంగళవారం ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద భర్త సి.వెంకటేశ్వరరావు, కుమారుడు జగదీష్ తో కలిసి మంత్రి సవిత పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా గంగానదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు కుంకుమ, పువ్వులు సమర్పించి హారతి ఇచ్చారు.

‘అమృత ఘడియల్లో పవిత్ర నదుల్లో పుణ్య స్నానాలు ఆచరించడం వల్ల మోక్షం లభిస్తుందని పురాణాలు, వేదాలు చెబుతున్నాయి. కుంభమేళాలు భారతీయ ఆధ్యాత్మికతకు, సంస్కృతీ సంప్రదాయాలకు పునాదులు వంటివి. ముఖ్యంగా ధర్మంపై విశ్వాసం పెంపుదలకు, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు మార్గం చూపుతాయని కోట్లాదిమంది నమ్మకం’ అని ఒక ప్రకటనలో మంత్రి సవిత తెలిపారు.