కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను మంత్రి సవిత మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ -2025లో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ నుద్దేశించి భారత మండపంలో ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంతి సవిత ఆయనను కలిశారు.
రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర చేయూతనందించాలని ఆమె కోరారు. గడిచిన 5 ఏళ్లు నాటి పాలకుల అసమర్థత కారణంగా ఏపీలో చేనేత పరిశ్రమ నిర్వీర్యమైపోయిందన్నారు. చేనేత ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పించకపోవడంతో పాటు జగన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లభించకపోవడంతో లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. చేసిన అప్పులు తీర్చలేక, ఉత్పత్తులు అమ్మకానికి నోచుకోక ఎందరో నేతన్నలు బలవన్మరణాలకు సైతం పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. 2024 ఎన్నికల్లో సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత నుంచి చేనేత రంగానికి మంచిరోజులు ప్రారంభమయ్యాయన్నారు. కొద్ది నెలల కిందటే నూతన టెక్స్ టైల్స్ పాలసీ తీసుకొచ్చామన్నారు. 2014-19 మధ్య ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం అమలు పథకాలన్నింటినీ మరోసారి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. వాటితో చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపునకు సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారన్నారు. నేతన్నలకు 365 రోజులు పని కల్పించాలన్న లక్ష్యంతో నూతన టెక్స్ టైల్స్ పార్కులు, వీవర్ శాలలు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం అండగా ఉంటే నేతన్నలకు మరింత ఆర్థిక భరోసా కలిగించే అవకాశముంటుందని కేంద్ర మంత్రి గిరిరాజ్ దృష్టికి మంత్రి సవిత తీసుకెళ్లారు. రాష్ట్రంలో చేనేత రంగంలో పెట్టుబడులకు సాయమందించాలని కోరారు. మంత్రి సవిత వినతులపై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. మంత్రి సవిత వెంట రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి తదితరులు పాల్గొన్నారు.
