మాజీ మంత్రి, భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్(Ganta Srinivas) సంచలన ట్వీట్ చేశారు. విశాఖ విమానశ్రయంలో ఆయనకు ఎదురైన అనుభవాన్ని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. విశాఖ నుంచి విజయవాడకు విమానంలో వెళ్లాలంటే సరైన సదుపాయాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు.
“ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడినుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యింది..
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా నాలానే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారు. విశాఖ – విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. దురదృష్టవశాత్తు ఈరోజు మంగళవారం కావడంతో వందేభారత్ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చింది. ఇది విశాఖ విమాన ప్రయాణీకుల దుస్థితి.” అని తెలిపారు. ఈమేరకు కేంద్ర విమానాయాన మంత్రి రామ్మోహన్ నాయుడు, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ను ట్యాగ్ చేశారు.