స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసేందుకు నంద్యాలకు వచ్చిన సీఐడీ అధికారుల ముందు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆడిన నాటకాలు అంతా ఇంతాకావని, ఆడినాటకాలు ఇకనుండైనా కట్టిపెట్టాలని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని నిరూపితం అయ్యిందని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబును అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టుకు తరలించే క్రమంలో అధికారులు చంద్రబాబును హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్తామని చెప్పినా ససేమిరా అంటూ రోడ్డు మార్గంలోనే వస్తానని చంద్రబాబు పట్టుబట్టడంలో అంతర్యం గ్రహించాలని ఎమ్మెల్యే నంద్యాల వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో అన్నారు. ఇందంతా చూస్తుంటే చంద్రబాబుపై ప్రజల్లో సానుభూతి వస్తుందన్న దురుద్ధేశంతో చేసిన పన్నాగం అని, అయితే ఆయన అవినీతి, అక్రమాల గురించి తెలిసిన ప్రజలు ఎక్కడా చంద్రబాబు అరెస్ట్ను అడ్డుకొనే ప్రయత్రం చేయలేదన్నారు. సోమవారం నంద్యాల పద్మావతినగర్ వైఎస్సార్సీపీ కార్యాలయంలో శిల్పాచక్రపాణిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి చంద్రబాబు అరెస్ట్పై హాట్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ… స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో సూట్ కేసు కంపెనీలను సృష్టించి 371కోట్ల ప్రజాధనాన్ని దోచేశారన్నారు. ఈ కేసులో సీఐడీ అధికారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేసేందుకు వచ్చిన సందర్భంగా ఆయన చేసిన నాటకాలు ఎంతగానో రక్తికట్టించాయని ఎద్దేవాచేశారు. ఇలాంటి నాటకాలు ఇకనైనా కట్టిపెట్టాలని హితవు : పలికారు. నాడు ఓటుకు నోటుకేసులో తప్పించుకొని దాక్కున్నాడని, అలాగే పత్తికొండలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు తనతో బస్సులో చంద్రబాబు బేరసారాలు ఆడాడని దానికి తానే సాక్ష్యం అని చెప్పారు. చంద్రబాబు రిమాండుకు నిరసనగా రాష్ట్రంలో బంద్కు పిలుపునిస్తే ఎక్కడా బంద్ జరిగిన దాఖలాలు కనిపించలేదన్నారు. అవినీతి చేస్తే బంద్లు చేయడం ఎంతవరకు సమంజనమో టీడీపీ నేతలు చెప్పాలన్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో కోట్లాది రూపాయలను దోచుకొన్నారని, అనేక కేసుల్లో విచారణ జరుపకుండా కాలయాపన చేస్తూ న్యాయస్థానాల్లో స్టేలు తీసుకురావడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందన్నారు.
అన్నీ కేసుల్లో విచారణ జరపాల్సిందేనని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. రానున్న రోజుల్లో వాస్తవాలు వెలికివస్తాయని,చట్టం తనపని తాను చేసుకుపోతుందని తెలిపారు. ముఖ్యమంత్రి.. జగన్మోహన్రెడ్డి కక్షతో చంద్రబాబును అరెస్ట్ చేయించారన్న దానిలో వాస్తవం లేదని, ఆయన చేసిన అవినీతి, అక్రమాలతోనే జైలుకు వెళ్ళాడన్నది బహిరంగ రహస్యం అన్నారు. ఇక చంద్రబాబు నాయుడి పని అయిపోయిందని, అలాగే టీడీపీ నాయకుల పనికూడా అయిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం: నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త శిల్పాభువనేశ్వరరెడ్డి, వైసీపీ నాయకులు: తిరుపంరెడ్డి, బుగ్గారెడ్డి, జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరెడ్డి, మోత్కూరు నాగేశ్వరరెడ్డి, ప్రవీణ్ తేజ, పుల్లయ్య, సుబ్బరామయ్య, పుల్లారెడ్డి, షభారెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.