Vishnu Kumar Raju: విశాఖపట్నం విమానాశ్రయం భోగాపురానికి మారుతున్న నేపథ్యంలో, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగరం నుంచి మరిన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించాలని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్‌రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు.
ప్రస్తుత ఐఎన్‌ఎస్ డేగా విమానాశ్రయం నుంచి పౌర విమానయాన కార్యకలాపాలు జూన్-జూలై నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలిపోయే అవకాశం ఉంది. దీనివల్ల నగరవాసులకు ప్రయాణ భారంతో పాటు రవాణా మార్పులు అవసరమవుతాయి. విశాఖపట్నం నుంచి ప్రధాన నగరాలైన విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, చెన్నైలకు డిమాండ్ విపరీతంగా ఉందని, వీటికి అదనపు వందే భారత్ సర్వీసులు కేటాయించాలని విష్ణుకుమార్‌రాజు కోరారు. ఈ రెండు నగరాల మధ్య నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, భవిష్యత్తులో ఈ సెక్టార్‌లో రద్దీ మరింత పెరగనుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం విశాఖ నుంచి సికింద్రాబాద్ , భువనేశ్వర్‌లకు వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఐటీ , పర్యాటక రంగం అభివృద్ధి చెందుతున్న క్రమంలో, సెమీ హైస్పీడ్ రైళ్ల సంఖ్య పెంచడం వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయి. భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే, రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రో లేదా ఫీడర్ సర్వీసుల అనుసంధానంపై కూడా చర్చ జరుగుతోంది.

