విశాఖపట్నం (తెలుగు ప్రభ): భారత స్వాతంత్ర్య దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ రసజ్ఞ వేదిక, అంకోసా (AMCOSA) సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని అంకోసా ఆడిటోరియంలో ‘రఫీ కే గీతోం భరీ శామ్’ పేరిట ప్రత్యేక సంగీత విభావరిని ఘనంగా నిర్వహించారు. జాన్స్ మ్యూజిక్ అకాడమీ అధినేత ఏఎస్‌యూ జాన్ సంగీత సహకారంతో ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన ప్రముఖ గాయకుడు జి. ఉమామహేష్ రఫీ పాడిన పలు ఆణిముత్యాల్లాంటి గీతాలను ఆలపించి శ్రోతలను రసపారవశ్యంలో ముంచెత్తారు. తొలుత ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు.
భాషకు అందని భావం.. సంగీతమే దైవత్వం : సభనుద్దేశించి విశాఖ రసజ్ఞ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రఘు రామారావు ప్రసంగిస్తూ— ఛత్తీస్‌గఢ్ నుంచి ఉమామహేష్‌ను విశాఖకు ఆహ్వానించడానికి గల కారణాలను వివరించారు. “తెలుగు నేలపై పుట్టి పెరిగి ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నప్పటికీ, హిందీ సంగీత దిగ్గజం మహమ్మద్ రఫీ పాటలను ఇంతటి స్పష్టతతో, భావయుక్తంగా పాడటం అభినందనీయం. సంగీత పరిజ్ఞానం ఉండటం భగవత్ ప్రసాదం. సంగీతానికి భాషతో నిమిత్తం లేదు; ప్రపంచవ్యాప్తంగా రఫీ గానాన్ని ఆస్వాదించని సంగీత ప్రియులు ఉండరు” అని కొనియాడారు.
విశిష్ట అతిథుల ప్రశంసల జల్లు : కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విశాఖ ఆకాశవాణి అధికారిణి కె. ఇందిర మాట్లాడుతూ.. రఫీ గీతాలు మధురాతి మధురమని, వాటిని గానం చేయడంలో ఉమామహేష్ కనబరిచిన ప్రతిభ అద్భుతమని ప్రశంసించారు. ఈ ప్రారంభ సభలో విశిష్ట గౌరవ అతిథులుగా.. కమోడోర్ డి. చంద్రశేఖర్ (రిటైర్డ్), అంకోసా అధ్యక్షులు డాక్టర్ ఈఎస్‌కే అప్పారావు, అంకోసా కార్యదర్శి డాక్టర్ పీవీ సుధాకర్ పాల్గొని ప్రసంగించారు.
సేవామూర్తులకు ఘన సత్కారం : సంగీత సంబరంతో పాటు సమాజ సేవకులకు గుర్తింపునిస్తూ, విశాఖ రసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో ఘన సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఆర్మీ విభాగంలో విశిష్ట సేవలందిస్తూ సామాజిక సేవా రంగంలో ముందంజలో ఉన్న మేడా మస్తాన్ రెడ్డిని, తెలుగు సాహితీ రంగానికి విశేష సేవలందిస్తున్న ప్రముఖ రచయిత రాంభట్ల నృసింహశర్మను సభాముఖంగా ఘనంగా సన్మానించి జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం బిలాస్‌పూర్ నుంచి విచ్చేసిన అభిమానులు, నగరవాసులు ఉమామహేష్ గళం నుంచి జాలువారిన రఫీ మధుర గీతాలను ఆలకిస్తూ రాత్రి పొద్దుపోయేంతవరకు సంగీత లహరిలో మునిగితేలారు.

