Tirumala Brahmotsavam: తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. ఐదో రోజు అత్యంత కీలకమైన ఘట్టం భక్తులను ఆధ్యాత్మిక పారవశ్యంలో ముంచెత్తుతోంది.
మోహినీ అలంకారం, శ్రీకృష్ణ రూపం
ఐదో రోజు ఉదయం, మలయప్పస్వామి భక్తులకు మోహినీ అలంకారంలో దర్శనమిచ్చారు. సర్వాలంకార భూషితుడై, మలయప్పస్వామిని దర్శించుకున్న భక్తులు తన్మయత్వం చెందారు. మోహినీ రూపం పక్కనే, మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమివ్వడం ఈ సేవ ప్రత్యేకత. ఈ రూపం లీలామానుషత్వానికి, భగవంతుడి మాయాశక్తికి ప్రతీకగా చెబుతారు. స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. ఈ వాహన సేవలో పెదజీయర్ స్వామి, చినజీయర్ స్వామి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు.
అత్యంత విశిష్టమైన గరుడ సేవ
బ్రహ్మోత్సవాల్లోనే అత్యంత విశిష్టమైన, కోట్లాది మంది భక్తులు ఎదురుచూసే శ్రీవారి గరుడ వాహన సేవ ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానుంది. సాక్షాత్తూ వైకుంఠనాథుడి వాహనమైన గరుత్మంతుడిపై శ్రీవారు విహరించడం చూస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గరుడ సేవ రోజున స్వామివారిని దర్శించుకుంటే ముక్తి లభిస్తుందని నమ్మకం.
గరుడోత్సవం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ, పోలీసు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించి, భద్రతను పటిష్టం చేశారు. ఈ అపురూప దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు మాడవీధుల్లో ఇప్పటికే స్థానాలు రిజర్వ్ చేసుకున్నారు. వైకుంఠం నుంచి భూలోకానికి విచ్చేసిన మహాద్భుతాన్ని కళ్ళారా చూడటం ఒక అదృష్టంగా భావిస్తున్నారు


