Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్తెలుగు రాష్ట్రాల్లో ముందుగానే రుతుపవనాలు.. అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు..!

తెలుగు రాష్ట్రాల్లో ముందుగానే రుతుపవనాలు.. అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు..!

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ కంటే..ముందుగానే తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చాయి. గతంలోకంటే వేగంగా పయనించిన ఈ రుతుపవనాలు కేవలం మూడు రోజుల్లోనే రెండు రాష్ట్రాల మొత్తాన్ని కవర్ చేసి ఆశ్చర్య పరిచాయి. రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. జూన్ నెలలో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే తక్కువగా ఉండొచ్చని స్పష్టంచేసింది.

- Advertisement -

మరోవైపు ఒడిశా తీరానికి సమీపంగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చింది. ఉత్తర దిశగా కదులుతున్న ఈ అల్పపీడనం త్వరలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఈ వాయుగుండం మరింతగా బలపడితే తుపానుగా మారే అవకాశాలు కూడా లేకపోలేవని అధికారులు చెబుతున్నారు.

దీని ప్రభావం ఉత్తరాంధ్రతోపాటు ఒడిశా తీర ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించనుంది. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో తక్కువ స్థాయిలో వర్షాలు పడుతుండగా, రాబోయే రోజుల్లో భారీవర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా. ప్రత్యేకంగా కోస్తాంధ్ర తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని హెచ్చరికలు జారీ అయ్యాయి.

బుధవారం నాటికి వాతావరణ అంచనాల ప్రకారం శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు, పార్వతీపురం మన్యం, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, శ్రీ సత్యసాయి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాల ముప్పు నెలకొంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటోంది. వర్షాలు, వరదలు, పిడుగుల నుంచి రక్షణ తీసుకోవాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. మొత్తానికి ముందుగా వచ్చిన రుతుపవనాలు ఒకింత ఊరటనిస్తే.. అల్పపీడనం వాతావరణంలో కలవరం రేపుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad