Montha cyclone Cancelled Trains in Andhra Pradesh: ఏపీని మొంథా తుపాను వణికిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో తుఫాను ప్రభావం మొదలవ్వగా.. పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మొంథా తుఫాను ఎఫెక్ట్‌తో ఈస్ట్ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మొంథా తుపాను ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పట్టుకుని పలు రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. విశాఖపట్నం మీదుగా నడిచే 43 రైలు సర్వీసులను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. మొంథా తుఫాను ఎఫెక్ట్‌తో నేడు, రేపు, ఎల్లుండి (27,28,29)వ తేదీల్లో విశాఖపట్నం మీదుగా నడిచే 43 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ 43 రైళ్లల్లో సూపర్ ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. రద్దైన ప్రధాన రైళ్లల్లో విశాఖపట్నం -హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం – కిరండోల్ ఎక్స్‌ప్రెస్, కిరండోల్ -విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, రాజమండ్రి – విశాఖపట్నం, విశాఖపట్నం – తిరుపతి, తిరుపతి – విశాఖపట్నం, విశాఖపట్నం – గుంటూరు డబుల్ డెక్కర్, గుంటూరు – విశాఖ డబుల్ డెక్కర్, విశాఖపట్నం తిరుపతి డబుల్ డెక్కర్, విశాఖపట్నం- మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఇలా పలు రైళ్లు ఉన్నాయి.
తుఫానుతో విశాఖపట్నంలో భారీ వర్షం..
మరోవైపు, మొంథా తుపాను కారణంగా విశాఖపట్నంలో ఇప్పటికే భారీ వర్షం కురుస్తోంది. తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తున్నాయి. తీరం వెంబడి వీస్తున్న బలమైన ఈదురుగాలులతో పలు చోట్ల భారీ ఎత్తున చెట్లు విరిగిపడ్డాయి. రోడ్డుపైకి వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షం, ఈదురు గాలుల నేపథ్యంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల బలమైన ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో చెట్లు, కరెంటు స్తంభాల కింద ఉండకూడదంటూ ప్రజలను అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ. మొంథా తుఫాను పర్యవేక్షణ నిమిత్తం విశాఖపట్నం జిల్లాకు ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. ప్రత్యేకాధికారి అజయ్ జైన్.. విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్ నుంచి తుపాను పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు కొండవాలు ప్రాంతాల్లోని ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇక, అనకాపల్లి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జలాశయాల వద్ద హైఅలర్ట్ ప్రకటించారు. పెద్దేరు, రైవాడ, తాండవ, కోనాం జలాశయాల వద్ద పరిస్థితిని సిబ్బంది 24 గంటలూ పర్యవేక్షించేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, తాండవ జలాశయానికి వరద నీరు పోటెత్తడంతో నీటి మట్టం భారీగా పెరిగింది. దీంతో, అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు, మొంథా తుఫాను ప్రభావంతో విశాఖపట్నంలోని పలు పర్యాటక ప్రదేశాలను అధికారులు మూసివేశారు. సందర్శకులను అనుమతించడం లేదు.




