Saturday, November 15, 2025
HomeTop StoriesMontha Cyclone: ముంచుకొస్తున్న సూపర్‌ సైక్లోన్‌.. కోస్తా జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ

Montha Cyclone: ముంచుకొస్తున్న సూపర్‌ సైక్లోన్‌.. కోస్తా జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ

Montha Cyclone effect in AP: ‘మొంథా’ సూపర్‌ సైక్లోన్‌ ఏపీ వైపు దూసుకొస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం వాయువ్య దిశగా వ్యాపిస్తోంది. అనంతరం ఉత్తర–వాయువ్య దిశగా ప్రయాణించి 28న ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీవ్ర తుపానుగా మారాక కాకినాడ–తుని సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఇది తీరం దాటే సమయంలో గంటకు గరిష్టంగా 110 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

మొదటి ప్రమాద హెచ్చరిక జారీ: తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో సాధారణం కంటే 1–1.5 మీటర్ల ఎత్తుకు అలలు ఎగసిపడతాయని తెలిపింది. ఈ నెల 29 వరకు వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను.. వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం, గంగవరం పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక సైతం జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరించారు.

రేపటి నుంచి అతి భారీ వర్షాలు: అల్పపీడనం నేపథ్యంలో ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 27నుంచి 30వ వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో 3 రోజులపాటు కోస్తాలోని పలు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసినట్టు పేర్కొన్నారు. రేపు అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉండడంతో.. ప్రకాశం, బాపట్ల, వైఎస్సార్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు.

Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/deputy-cm-pawan-kalyan-directs-kakinada-officials-to-brace-for-montha-cyclone-landfall/

అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ఉపముఖ్యమంత్రి: ‘మొంథా‘ తుపాను తీరం దాటే ప్రమాదం ఉండడంతో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం కాకినాడ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం మొంథా తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో.. పవన్ కల్యాణ్ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ , ఇతర అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. తుపానుపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కోరారు. తీర ప్రాంత గ్రామాల ప్రజలను సురక్షిత సహాయ కేంద్రాలకు తరలించాలని ఉపముఖ్యమంత్రి సూచించారు. సహాయక కేంద్రాల్లో ఆహారం, ఔషధాలు, తాగునీరు, పాలు వంటి నిత్యావసరాలను సమకూర్చాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad