Montha Cyclone Alert on Coastal Areas: ‘మొంథా’ తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాలైన కోస్తా జిల్లాల జాతీయ రహదారులపై భారీ వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచనలు చేసింది.
మంగళవారం మధ్యాహ్నం నాటికి ఈ తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో విజృంభించింది. గడిచిన ఆరు గంటల్లోనే ఈ వేగం నమోదైంది. ప్రస్తుతం మచిలీపట్నానికి 60 కిలోమీటర్లు, కాకినాడకు 140 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉండగా.. నేటి రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 90-100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగానికి చేరుకోవచ్చని హెచ్చరికలు జారీ చేసింది.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/heavy-rains-cyclone-montha-effect-on-andhra-pradesh/
మొంథా తీవ్ర తుపాను నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనిత, నారాయణ, సీఎస్ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తుపాను తీరానికి సమీపిస్తుండటంతో దాని ప్రభావం ఇప్పటికే కోస్తా జిల్లాలపై మొదలైందని.. కాకినాడ, మచిలీపట్నం, విశాఖ తీర ప్రాంతాల్లో వర్షాలు, గాలుల తీవ్రత అధికంగా ఉందని అధికారులు సీఎంకు వివరించారు.
ఈ మేరకు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. గత తుపానుల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి, అందుకు తగినట్లుగా చర్యలు తీసుకోవాలన్నారు. కాకినాడ, పరిసర ప్రాంతాలకు NDRF, SDRF బృందాలను వెంటనే పంపాలని.. గాలులు, వర్షాల తీవ్రతను ముందుగానే అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం వెల్లడించారు.
కాగా, మొంథా తుపాను తీవ్రంగా మారడంతో ప్రభావిత జిల్లాల కలెక్టర్లను పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశామని సీఎస్ విజయానంద్ తెలిపారు. విశాఖపట్నంతో పాటు ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేసినట్లు పేర్కొన్నారు.


