Montha Cyclone Holiday to Schools: రాష్ట్రంలో మొంథా తీవ్ర తుపాను ప్రభావంతో రేపు(బుధవారం) పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే కాకినాడలో ఈ నెల 31వరకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించగా.. తుపాను ప్రభావం ఉన్న జిల్లాల్లో సైతం రేపు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీని మొంథా తీవ్ర తుపాను తీరం వైపు వేగంగా దూసుకువస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి, విశాఖ, కోనసీమ, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, తిరుపతి, కడప, నెల్లూరు జిల్లాల్లోని పాఠశాలలకు అక్టోబర్ 29న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇక, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కళాశాలలకు రేపు హాలిడేగా నిర్ణయించారు.
మొంథా తీవ్ర తుపాను నేపథ్యంలో ఇప్పటికే ప్రభావిత జిల్లాల్లోని జాతీయ రహదారులపై భారీ వాహనాలకు అధికార యంత్రాంగం నిషేధం విధించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత రైల్వే శాఖ అప్రమత్తమైంది.
తక్షణ చర్యలు చేపట్టేందుకు వీలుగా తెలుగు రాష్ట్రాలు, ఒడిశాలో డివిజనల్ వార్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఉన్నతాధికారులను ఆదేశాలు జారీ చేశారు. తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైల్వే శాఖ సర్వసన్నద్ధంగా ఉండాలని.. ప్రత్యేకించి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం డివిజన్ల పరిధిలో అవసరమైన యంత్రాలు, సామగ్రితో పాటు సిబ్బందిని తక్షణమే అందుబాటులో ఉంచాలని ఆయన సంబంధిత అధికారులకు వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించారు.
తుపాను వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి తీసుకుంటున్న చర్యలపై అధికారుల నుంచి నివేదిక కోరిన అశ్వినీ వైష్ణవ్.. తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని.. తుపాను కారణంగా రైళ్ల రాకపోకలకు అంరాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాలని ఉద్ఘాటించారు.


