Montha Cyclone Live Updates ; మొంథా తుపాను భయపెడుతోంది. తీరాన్ని సమీపించేకొద్దీ తీవ్రత పెరుగుతోంది. రేపు కాకినాడ-కోనసీమ మధ్య తీరం దాటనుందనే హెచ్చరికలు విన్పిస్తున్నాయి. కోనసీమ ప్రజలకు 1996 తుపాను గుర్తొస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పుడు మొంథా తుపాను వణికిస్తోంది. ముఖ్యంగా కోస్తా తీరం ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నిన్న రాత్రికి తుపానుగా బలపడిన వాయుగుండం రేపు ఉదయానికి తీవ్ర తుపానుగా మారనుంది. అనంతరం కాకినాడ-కోనసీమ జిల్లాల మధ్య తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. దీనికితోడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే ఏపీలోని కాకినాడ, కోనసీమ, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షం తీవ్రత కూడా అంతకంతకూ పెరుగుతోంది.
ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఇక తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. తుపాను తీవ్రత నేపధ్యంలో ఇప్పటికే ఏపీలో దాదాపు అన్ని జిల్లాల్లో 2-3 రోజులు విద్యాసంస్థలకు సెలవులిచ్చేశారు. కాకినాడ జిల్లాల్లో ఇవాళ్టి నుంచి 31వ తేదీ వరకూ సెలవులిచ్చారు.
మొంతా తుపాను కాకినాడ-కోనసీమ మధ్య తీరం దాటనుందనే హెచ్చరికల నేపధ్యంలో కోనసీమ ప్రజలకు 1996 నాటి కోనసీమ తుపాను గుర్తొస్తోంది. ఆనాడు వందలాది ప్రాణాలు పోయాయి. వేలాది ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. నాటి కోనసీమ బీభత్సాన్ని ఇప్పటికీ అక్కడి ప్రజలు మర్చిపోలేరు. అందుకే మొంతా తుపాను కోనసీమ తీరంలో తీరం దాటనుందనే హెచ్చరికలలో ప్రజలు భయపడుతున్నారు.
మొంతా తుపాను నేపధ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. మిగిలిన జిల్లాలకు ఆరంజ్, ఎల్లో అలర్ట్ జారీ అయింది.


