అన్నమయ్య జిల్లా ( తెలుగు ప్రభ) : సాధారణ రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి, పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదిగితే ఎంతటి అవకాశాలనైనా అందుకోవచ్చని మూడే వినోద్‌కుమార్ నాయక్ నిరూపించారు. టి.సుండుపల్లి మండలం సొంఠంవారిపల్లి గ్రామానికి చెందిన మూడే వెంకటరమణ నాయక్ కుమారుడు మూడే వినోద్‌కుమార్ నాయక్ కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థలో అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ (మెడికల్ డివైసెస్)గా పదోన్నతి పొందారు.
కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయనకు ఈ పదోన్నతి లభించింది. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వినోద్‌కుమార్ నాయక్ తన కృషి, పట్టుదల, నిజాయితీ, అంకితభావంతో ఒక్కో మెట్టు ఎదుగుతూ దేశ అత్యున్నత కేంద్ర ప్రభుత్వ సేవలో ఈ స్థాయికి చేరుకోవడం గ్రామానికి, మండలానికి, జిల్లాకు గర్వకారణమని గ్రామస్థులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు. వినోద్‌కుమార్ నాయక్ విజయ ప్రస్థానం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కష్టపడి చదివి లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో ముందుకు సాగితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని ఆయన ప్రస్థానం చాటిచెబుతోందన్నారు.
ఈ సందర్భంగా మూడే వినోద్‌కుమార్ నాయక్‌కు గ్రామస్థులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి దేశ ప్రజలకు విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించారు.

