ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన రాజ్యసభ ఎంపీల గురించి ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తమ పార్టీకి ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు ఇప్పటివరకు బయటకు వెళ్లారని.. అయినా వైసీపీకి ఏం కాదన్నారు. రాజకీయాల్లో ఎవరికైనా క్యారెక్టర్ ఉండాలన్నారు. ఎవరికో భయపడి నిర్ణయాలు తీసుకునే వారు రాజకీయాల్లో పనికిరారు అని పేర్కొన్నారు. భయం, ప్రలోభాలకు లొంగి క్యారెక్టర్‌ను తగ్గించుకోవద్దని సూచించారు. సాయిరెడ్డికైనా, ఇంకెవరికైనా ఇదే వర్తిస్తుందని తెలిపారు.
జగన్ వ్యాఖ్యలపై ఇప్పటికే విజయసాయి రెడ్డి ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చిన విషయం విధితమే. “వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలనే వదులుకున్నా” అని ట్వీట్ చేశారు.
తాజాగా జగన్ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ(Mopidevi Venkata Ramana) స్పందించారు. తాను ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగే వ్యక్తినో కాదో జగన్ అంతరాత్మకు తెలుసు అన్నారు. జగన్‌తో పాటు తాను కూడా జైల్లో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. భయపడి లొంగిపోయే వ్యక్తిని అయితే జగన్ అక్రమాస్తుల కేసులో ఇరుక్కునే వాడిని కాదంటూ కౌంటర్ ఇచ్చారు.