Mudragada Padmanabham| కాపు ఉద్యమ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేయడం మీకు తగునా అంటూ పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా.. సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి అంటూ చురకలు అంటించారు. హామీలను అమలు చేయలేకే వైసీపీ నేతలు, కార్యకర్తలపై సోషల్ మీడియా కేసులు, రెడ్ బుక్ పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా సాధనపై దృష్టి పెట్టాలని సూచించారు. అమాయకులను జైల్లో పెట్టి కొట్టించకూడదంటూ తెలిపారు.
కాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమికి ఓట్లు వేయొద్దంటూ ప్రజలకు ముద్రగడ వరుసగా లేఖలు రాసిన సంగతి తెలిసిందే. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawankalyan) టీడీపీతో పొత్తు పెట్టుకోవడంపైనా విమర్శలు చేస్తూ లేఖలు రాసేవారు. ఈ క్రమంలోనే ఆయన వైసీపీ కండువా కప్పునున్నారు. అనంతరం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో పాటు పిఠాపురంలో పవన్ భారీ మెజార్టీతో గెలవడంతో తన పేరును పద్మనాభం రెడ్డిగా మార్చుకున్నారు. మళ్లీ ఇన్ని నెలల తర్వాత లేఖలు రాయడం మొదలుపెట్టారు.