ఆర్మీ జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలంలోని కల్లితండా గ్రామంలో శనివారం ఉదయం నిర్వహించారు. దేశానికి సేవలందిస్తూ వీరమరణం పొందిన మురళీ నాయక్ కు ప్రజల నుంచి ఘన నివాళులుఇవ్వబడాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మురళీ నాయక్‌కు చివరి వీడ్కోలు చెప్పేందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, ఆర్మీ సైనికులు పెద్దఎత్తున హాజరయ్యారు.
జవాన్ పార్థివదేహాన్ని గ్రామానికి తీసుకురాగానే వందలాది మంది గ్రామస్తులు “జై జవాన్”, “మురళీ నాయక్ అమర హై అంటూ నినాదాలు చేశారు. అనంతరం పూర్తి సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీ నాయక్ సేవలను స్మరించుకుంటూ పలువురు కన్నీటిపర్యంతమయ్యారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి తానేటి అనిత, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్‌లు మురళీ నాయక్ పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబాన్ని పరామర్శించారు. మంత్రి లోకేష్ పాడె మోసి తన గౌరవాన్ని చాటారు. మురళీ నాయక్ త్యాగం ఈ దేశానికి చిరస్మరణీయమని వ్యాఖ్యానించిన మంత్రి లోకేష్, దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్‌కు మా ఘన శ్రద్ధాంజలి. వారి తల్లిదండ్రులను కలిసి పరామర్శించాం. ప్రభుత్వం ఎప్పటికీ ఈ కుటుంబానికి అండగా నిలుస్తుంది అని ట్వీట్ చేశారు.
దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ సేవలు ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదని ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానికులు ఏకవాక్యంగా అభిప్రాయపడ్డారు.