కొత్త రేషన్ కార్డుల(Ration Cards) జారీపై మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా ఈ-కేవైసీ పూర్తి చేస్తామన్నారు. అనంతరం మే నెల నుంచి ఏటీఎం కార్డు తరహాలో స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. ఇది రేషన్ కార్డుగా కాకుండా ఫ్యామిలీ కార్డుగా ఉంటుందన్నారు. కొత్త రేషన్‌కార్డులో క్యూఆర్ కోడ్, ఇతర భద్రతా ఫీచర్లు ఉంటాయని వెల్లడించారు. కుటుంబసభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డులకు ఆప్షన్లు ఇస్తామన్నారు. ఈ-కేవైసీ పూర్తయితే ఎంతమందికి కార్డులు ఇవ్వాలో స్పష్టత వస్తుందని తెలిపారు.
ఇక ఖరీఫ్‌లో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. వాట్సప్ ద్వారా కూడా ధాన్యం అమ్ముకునే అవకాశాన్ని కల్పించినట్లు వెల్లడించారు. వాట్సప్ ద్వారా 16వేల మంది రైతులు ధాన్యాన్ని విక్రయించినట్లు వివరించారు. రైతులు ఏ మిల్లుకు కావాలంటే ఆ మిల్లుకు వెళ్లి ధాన్యం అమ్ముకునే అవకాశం ఇచ్చామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో గత ప్రభుత్వం కన్నా 20 శాతం అధికంగా ధాన్యం కొనుగోలు జరిగిందని తెలిపారు. రైతులకు గన్నీ బ్యాగ్స్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. అలాగే స్కూళ్లు, హాస్టళ్లలో మధ్యాహ్న భోజనం సన్న బియ్యంతో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అని నాదెండ్ల వెల్లడించారు.