ఏపీ సీఎం చంద్రబాబుతో(Chandrababu) బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి(Nagam Janardhan Reddy) భేటీ అయ్యరు. ఏపీ అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జనార్ధన్ రెడ్డిని చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. ఆరోగ్యం, కుటుంబ యోగక్షేమాలపై ఆరా తీశారు. అనంతరం తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలపై చర్చించుకున్నారు
కాగా ఉమ్మడి ఏపీలో ఓబులాపురం మైనింగ్ అంశంపై అప్పటి టీడీపీ నేతలు చేసిన ఉద్యమాలపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల విచారణలో భాగంగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు నాగం హాజరయ్యారు. కోర్టు విచారణ అనంతరం చంద్రబాబును కలవడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాగం జనార్ధన్ రెడ్డి పార్టీలో అత్యంత కీలక నేతగా మారారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో 2012లో టీడీపీకి రాజీనామా చేసి ‘తెలంగాణ నగారా సమితి’ పార్టీని ఏర్పాటు చేశారు. 2013లో బీజేపీలో చేరారు. 2018లో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక 2023లో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మళ్లీ యాక్టివ్ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో టీడీపీలో పనిచేసిన హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి తిరిగి టీడీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. అలాగే మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి సైతం టీడీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా జరిగింది. ఈ క్రమంలో చంద్రబాబుతో నాగం జనార్ధన్ రెడ్డి భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది.
