Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala Collector: ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరగాలి

Nandyala Collector: ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరగాలి

అసంక్రమిత వ్యాధుల సర్వేను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయండి

ప్రభుత్వ ఆసుపత్రులలోనే గర్భిణులు ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలోనే అత్యధికంగా గర్భిణులు ప్రసవాలు జరిగితే సంబంధిత లబ్ధిదారులు ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందడమే కాకుండా ఆసుపత్రులకు ఆర్థిక వనరులు సమకూరే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని కమ్యూనిటి హెల్త్ సెంటర్లలో ఎక్సరే యంత్రాలు పనిచేసేలా రాష్ట్ర స్థాయి దృష్టికి తీసుకెళ్లి మరమ్మతులు చేయిస్తామని కలెక్టర్ తెలిపారు. వైద్యాధికారులందరూ ముఖ ఆధారిత హాజరు తప్పనిసరిగా వేస్తూ పని వేళల్లో రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలకు గర్భిణీలకు ఐరన్ పోలిక్ టాబ్లెట్లు ఇవ్వడంతో పాటు విటమిన్-ఎ ద్రావకాన్ని క్రమం తప్పకుండా వేయించాలన్నారు. జ్వరంతో పాటు చర్మవ్యాధి సంబంధిత వ్యాధులు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్సలు పొందేలా అవగాహన కల్పించాలన్నారు.

- Advertisement -

జిల్లాలో అసంక్రమిత వ్యాధుల సర్వేను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆరోగ్య కేంద్ర పరిధిలోని గర్భవతులు, బాలింతలకు హైపర్ టెన్షన్, షుగర్ జబ్బులను తప్పనిసరిగా స్క్రీన్ టెస్ట్లు చేయాలన్నారు. YSR కంటి వెలుగు కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రమాద సంకేత లక్షణాలున్న గర్భిణి స్త్రీలను ఉన్నత ఆసుపత్రులకు రెఫర్ చేసి ఆశా, సచివాలయ ఆరోగ్య కార్యకర్తల ద్వారా మానిటర్ చేసి ఆరోగ్య శ్రీ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాల్లో వున్న ఖాళీలను భర్తీకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News