ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని నంద్యాల పర్యటన సందర్భంగా ఐఎంఏ రాష్ట్ర శాఖ తరపున, నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తో కలిసి ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వినతి పత్రంలో ఉన్న అంశాలన్నీ రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శితో చర్చించి సమస్యలు పరిష్కరించడానికి తగు నిర్ణయాలు తీసుకుంటామని, ఐఎంఏ తెలిపిన అంశాలను అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. వినతి పత్రంలోని అంశాలను డాక్టర్ రవి కృష్ణ మంత్రికి వివరించారు. ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ ఏక గవాక్ష విధానంలో ఏర్పాటు చేయాలని, 15 మీటర్ల లోపు భవనాల ఆసుపత్రులకు, జాతీయ భవన నిబంధనలకు అనుగుణంగా అగ్నిమాపక నిరభ్యంతర పత్రం లేకుండా ఆసుపత్రిల రిజిస్ట్రేషన్ చేయాలని, ఒక్క స్పెషాలిటీ తో ఉన్న 20 పడకల ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకోవాలని తద్వారా చిన్న పట్టణాల్లో ఆరోగ్యశ్రీ సేవలు మరింత విస్తృతంగా పేద ప్రజలకు అందుతాయని చెప్పారు. వైద్యులపై దాడుల నియంత్రణ కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి రూపొందించిన ఆంధ్రప్రదేశ్ వైద్యుల రక్షణ చట్టం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించాలని, రోగికి అందించిన సేవలపై ఆసుపత్రులు, వైద్యులపై ఆరోపణలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా కేసులు నమోదు చేయడానికి అనుసరించాల్సిన నిర్దిష్ట విధానం రూపొందించాలని కోరారు. ఆసుపత్రుల నుండి వైద్య వ్యర్థాలను సేకరించే సంస్థలు తీసుకుంటున్న ఫీజులు హేతుబద్ధంగా నిర్ణయించడానికి రాష్ట్ర కాలుష్య నియంత్రణ శాఖ సలహా మండలి సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య విధివిధానాలు, అమలు చేసే నిబంధనలు రూపొందించే సమయంలో రాష్ట్ర ఐఎంఏ ను సంప్రదించడం ద్వారా వాటిని అమలు చేసే వైద్యుల ఆలోచనలు,సలహాలు పరిగణన లోకి తీసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు.
ఈ సందర్భంగా నంద్యాల ఐఎంఏ వైద్యులు మంత్రిని ఘనంగా సత్కరించి నంద్యాలలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు అవుతున్న సందర్భంగా అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ రాకేష్ రెడ్డి,ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి,నంద్యాల ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ జఫరుల్లా, డాక్టర్ చంద్రశేఖర్, కోశాధికారి డాక్టర్ పనిల్,వర్కింగ్ కమిటీ రాష్ట్ర సభ్యులు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ వినోద్,ఐఎంఏ మహిళా విభాగం నాయకులు డాక్టర్ నాగమణి,డాక్టర్ నర్మదా, డాక్టర్ వసుధ, డాక్టర్ అరుణకుమారి, డాక్టర్ శైలజ, డాక్టర్ షబ్నం తదితరులు పాల్గొన్నారు.
Nandyala: ఆరోగ్య శాఖా మంత్రికి రాష్ట్ర ఐఎంఏ వినతిపత్రం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES