మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) సెంచరీ చేయడంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. మూడో రోజు ఆట ముగిసిన అనంతరం టీమిండియా సభ్యులు బస చేసిన హోటల్‌కు వెళ్లిన తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు నితీష్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య భావోద్వేగాలు ఉప్పొంగాయి. ఇందుకు సంబంధించిన సంబంధించిన వీడియోను బీసీసీఐ పోస్టు చేసింది. తాజాగా ఈ పోస్టుపై ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) స్పందించారు.
“యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుత సెంచరీ పట్ల అందరం గర్విస్తున్నాం. అతడు సాధించిన ఘనత చిన్నది కాదు. తద్వారా తన కుటుంబాన్ని గర్వించేలా చేశాడు. కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలకు తన సెంచరీ ద్వారా తగిన నజరానా అందించాడు. బిడ్డ కలను నిజం చేయడానికి ప్రతి దశలోనూ తోడుగా ఉన్న అతడి తల్లిదండ్రులకు శుభాభినందనలు. తెలుగు సమాజాన్ని నితీష్ గర్వపడేలా చేశాడు. భవిష్యత్తులోనూ ఇదే విధంగా రాణించాలని కోరుకుంటున్నాను” అంటూ ఆమె తెలిపారు.