Nara Devansh World Record Chess: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడి మనవడు, నారా దేవాన్ష్ అరుదైన ఘనత సాధించారు. ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్- 175 పజిల్స్ సాధించి ప్రపంచ రికార్డు అందుకున్నారు. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ హాల్‌లో దేవాన్ష్‌కు నిర్వాహకులు అవార్డు ప్రదానం చేశారు. అవార్డు ప్రదానోత్సవానికి దేవాన్ష్ తల్లిదండ్రులు నారా లోకేశ్, బ్రాహ్మణి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కొడుకు విజయంపై మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డును దేవాన్ష్ అందుకోవడం చాలా గర్వంగా ఉందని వెల్లడించారు. ‘ఇది ఒక ప్రత్యేకమైన ఘనత. ఒక తండ్రిగా పుత్రోత్సాహం పొందుతున్నా. పదేళ్ల వయసులోనే ఆలోచనలకు పదును పెడుతూ.. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉంటూ దేవాన్ష్ చెస్ నేర్చుకున్నాడు. తన కష్టాన్ని, గంటల తరబడి కఠోర శ్రమను తండ్రిగా దగ్గరుండి చూశా. నా కుమారుడి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని చూసి గర్విస్తున్నా.’ అని పేర్కొన్నారు.
2025 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు అందుకున్న దేవాన్ష్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. 175 పజిల్స్‌లో ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్‌గా విజయం సాధిచడం పట్ల తాము గర్విస్తున్నట్లు చంద్రబాబు అన్నారు. గురువుల మార్గనిర్దేశంలో నెలల తరబడి పట్టుదలతో కృషి చేసి ఈ ఘనత సాధించాడని హర్షం వ్యక్తం చేశారు.
కాగా చెస్ డొమైన్‌లో గతంలోనూ దేవాన్ష్ రెండు రికార్డులు నెలకొల్పారు. గతేడాది డిసెంబర్‌లో దేవాన్ష్ చదరంగంలో ప్రపంచ రికార్డ్ సాధించారు. చదరంగంలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించడం ద్వారా కేవలం తొమ్మిదేళ్ల వయస్సులోనే ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్-175 పజిల్స్ సాధించి రికార్డు సృష్టించారు. వ్యూహాత్మకమైన ఆటతీరుతో 11 నిమిషాల 59 సెకన్లలో చెక్‌మేట్ పజిల్స్‌ను దేవాన్ష్ పూర్తి చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పడం విశేషం.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/jp-nadda-comments-on-ap-development/
ప్రఖ్యాత చెస్ గ్రాండ్ మాస్టర్ లాస్లో పోల్గార్ రచించిన “5334 ప్రాబ్లమ్స్, కాంబినేషన్స్, అండ్ గేమ్స్” పుస్తకం నుంచి తీసుకున్న 175 క్లిష్టమైన చెక్‌మేట్ పజిల్స్‌ను అత్యంత వేగంగా పరిష్కరించి ‘ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్’గా దేవాన్ష్ నిలిచారు. సులభం నుంచి అత్యంత కఠినంగా మారే ఈ పజిల్స్‌ను పరిమిత సమయంలో పరిష్కరించడం ద్వారా దేవాన్ష్ తన వేగాన్ని, మేధాశక్తిని ప్రపంచానికి తెలియజేశారు.
తల్లిదండ్రులు నారా లోకేశ్, బ్రాహ్మణిల ప్రోత్సాహం, కోచ్ కె. రాజశేఖర్ రెడ్డి మార్గదర్శకత్వంలో దేవాన్ష్ నెలల తరబడి ఏకాగ్రతతో సాధన చేశారు. ఏడు డిస్క్‌ల ‘టవర్ ఆఫ్ హనోయి’ పజిల్‌ను కేవలం 1 నిమిషం 43 సెకన్లలో పూర్తి చేయడం, అలాగే 9 చెస్ బోర్డులను 32 పావులతో కేవలం 5 నిమిషాల్లో సరిగ్గా అమర్చడం ద్వారా కూడా రికార్డు కావడం గర్వించదగ్గ విషయం.


