బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌లను అరికట్టాలంటూ యూట్యూబర్ అన్వేష్ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పేరుమోసిన సినీ తారలు సైతం గోవిందా పేరుతో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. కొందరు యువత వీటి బారిన పడి మోసపోతున్నారంటూ పేర్కొన్నారు. ఇలాంటి యాప్స్‌పై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి నారా లోకేశ్(Nara lokesh), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కోరాడు.
దీనిపై మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. బెట్టింగ్ యాప్‌లు చాలా మంది జీవితాలను నాశనం చేస్తున్నాయని తెలిపారు. బెట్టింగ్ యాప్‌ల మోజులో పడి ఎంతో మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న విషయాలు తన దృష్టికి కూడా వచ్చాయని పేర్కొన్నారు. ఇక్కడితో వీటికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. యువత బెట్టింగ్ యాప్‌ల బారిన పడకుండా అవగాహన కల్పించడంతో పాటు ఆయా యాప్‌లపై చర్యలు తీసుకోవడమే పరిష్కారం అని చెప్పారు. ఇందుకోసం బెట్టింగ్ నిరోధక విధానాన్ని రూపొందిస్తున్నామని వివరించారు. తమ ప్రభుత్వం తీసుకురాబోయే విధానం దేశానికే ఆదర్శం కానుందని వెల్లడించారు.