Nara Lokesh Patna election campaign : ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ప్రచారం చేయడానికి శనివారం పాట్నా చేరుకున్నారు. టీడీపీ ఎంపీలతో కలిసి వచ్చిన ఆయనకు స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ మంత్రి నారా లోకేష్ బీహార్ చేరుకున్నారు. ఈ పర్యటనలో యువతకు ఉద్యోగాల కల్పనే ప్రధాన అంశంగా తీసుకుని, ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతు పెంచేందుకు లోకేశ్ ప్రయత్నాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు, ఐటీ హబ్‌లు తీసుకురావడంలో ఆయన చూపిన చొరవ బీహార్ యువతకు మోడల్‌గా మారుతుందని ఎన్డీఏ నాయకులు ఆశిస్తున్నారు.
బీహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 6న మొదటి దశ పోలింగ్ ముగిసింది. రెండో దశలో 122 స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ జరుగనుంది. ప్రచారం నవంబర్ 9 సాయంత్రం ముగియనుంది. ఈ క్రమంలో చివరి రెండు రోజులు లోకేశ్ పాట్నాలోనే ఉంటూ, ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతు తెలుపనున్నారు. ఈ నేపథ్యంలో పారిశ్రామికవేత్తలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఆదివారం పాట్నాలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తూ, యువత ఉద్యోగాలపై ప్రధానంగా మాట్లాడనున్నారు.
బీహార్‌లో నిరుద్యోగం, వలసల సమస్యలు పెద్ద సవాలుగా మారాయి. గత ఎన్నికల్లో ఎన్డీఏ 125 స్థానాలు గెలుచుకుని, బీజేపీ 78, జేడీయూ 43 స్థానాలతో అధికారంలో ఉంది. ఈసారి రిజల్ట్‌లు నవంబర్ 23న వెలుగులోకి వస్తాయి. ఎన్డీఏ యువతకు ఉద్యోగాలు, స్కిల్ డెవలప్‌మెంట్‌పై దృష్టి పెట్టి ప్రచారం చేస్తోంది. లోకేశ్ ఆంధ్రలో గూగుల్ డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రాజెక్టులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ అనుభవాన్ని బీహార్ పరిశ్రమలకు ఉపయోగపడేలా వివరిస్తానని ఆయన తెలిపారు. “బీహార్ యువతకు ఉద్యోగాలు, పరిశ్రమలు తీసుకురావడమే మా లక్ష్యం” అని లోకేశ్ తెలిపారు.


