మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) అరెస్టుపై మంత్రి నారా లోకేష్(Nara Lokesh) స్పందించారు. దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకు వంశీని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. ఈ కేసులో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు. చట్టప్రకారంగా తీసుకోవాల్పిన చర్యలను తీసుకుంటామని స్పష్టం చేశారు. 2014-19 మధ్య తమ ప్రభుత్వం చక్కగా పరిపాలించిందని.. కానీ 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం అరాచకంగా పాలన చేసిందన్నారు. ప్రజాసమస్యలపై పోరాడితే తమ పార్టీ నేతలను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారన్నారు.
చివరకు పార్టీ అధినేత చంద్రబాబును కూడా బయటకు రానీయకుండా ఇంటి గేటుకు తాళ్లు కూడా కట్టారని గుర్తు చేశారు. అక్రమ కేసులు పెట్టడం, పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారని మండిపడ్డారు. గత ఐదేళ్లలో తప్పు చేసిన వైసీపీ నేతలు, అధికారులను చట్టపరంగా శిక్షిస్తామని యువగళంలో రెడ్ బుక్ చూపించి చెప్పామన్నారు. చట్టాలు ఉల్లఘించి ఇబ్బందిపెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదని.. వారిపై కచ్చితంగా రెడ్ బుక్ అమలు అవుతుందని లోకేష్ వెల్లడించారు.