వైసీపీ నాయకులు రెడ్‌బుక్ పేరు వింటేనే జంకుతున్నారని మాజీ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ(TDP Formation Day) వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. రెడ్‌బుక్ పేరు వింటనే కొందరికి గుండెపోటు వస్తుందని.. కొంతమంది బాత్‌రూమ్‌లో పడి చెయ్యి విరగ్గొట్టుకుంటున్నారంటూ మాజీ మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డిలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అర్థమైందా రాజా.. అధికారాన్ని చూసి ఎప్పుడూ గర్వపడొద్దంటూ వైసీపీ నేతలకు హితవు పలికారు. ఐదేళ్ల పాలనలో వైసీపీ నేతలు పాల్పడిన అక్రమాలు, భూకబ్జాలు, అవినీతిపై కూటమి సర్కార్ సమర శంఖం పూరించిందన్నారు.
2019 వరకూ టీడీపీ చూసిన రాజకీయం వేరని.. 2019 నుండి 2024 వరకూ చూసిన రాజకీయం వేరని తెలిపారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తే వెన్నుచూపకుండా ఎదురునిలబడ్డామన్నారు. అధినేత చంద్రబాబు ఇంటికి తాళ్లు కడితే తాళ్లు తెంచుకొని పోరాడామన్నారు. క్లైమోర్ మైన్లకే భయపడని బ్లడ్ మనది. కామిడీ పీసులకు భయపడతామా? అని పేర్కొన్నారు. నలుగురు ఎమ్మెల్యేలను లాక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాం అన్నవారికి ప్రతిపక్ష హోదా లేకుండా ఇంటికి పంపామని.. ప్యాలెస్‌లు బద్దలు కొట్టామని లోకేశ్ వెల్లడించారు.