Nara Lokesh Google Vizag Hub : ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ రంగంలో చారిత్రక మైలురాయిని సాధించింది. టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో 1 గిగావాట్ సామర్థ్యంతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం రూ.88,628 కోట్ల (10 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టనున్నారు. మంగళవారం ఢిల్లీలో తాజ్‌మహల్ హోటల్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో ఒప్పందాల మార్పిడి జరిగింది. ఐటీ మంత్రి నారా లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, గ్లోబల్ ఇన్‌ఫ్రా వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే పాల్గొన్నారు.
ALSO READ: Rain Alert: నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీచేసిన వాతావరణ శాఖ!
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, “టెక్ ప్రపంచంలో ఏపీకి ఇదొక చారిత్రక రోజు. డేటా సెంటర్లు దేశానికి కొత్త రిఫైనరీల వంటివి. విజనరీ నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో మరిన్ని ప్రాజెక్టులు రానున్నాయి” అని అభివర్ణించారు. గూగుల్ రాకతో ఏపీ గ్లోబల్ టెక్ మ్యాప్‌పై పదిలం చేసుకుంటుందని, డిజిటల్ ఇన్నోవేషన్, ఏఐ రంగాల్లో కొత్త అధ్యాయం మొదలవుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రియల్‌టైమ్ గవర్నెన్స్ సేవలకు గూగుల్ మరింత సహకారం అందించాలని కోరారు.
కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, “గూగుల్ నిర్ణయం దేశంలోని ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు తీసుకువస్తుంది. ఏపీ లాంటి రాష్ట్రాలు దేశ ప్రగతికి కీలకం. కేంద్రం తీసుకొచ్చిన డేటా సెంటర్ పాలసీ వల్లే ఇలాంటివి సాధ్యమవుతున్నాయి” అన్నారు. ‘గూగుల్ ఏఐ హబ్’ భారతదేశంలో మొట్టమొదటి కృత్రిమ మేధస్సు కేంద్రంగా నిలుస్తుంది. అమెరికా వెలుపల గూగుల్ నిర్మించే అతిపెద్ద డేటా సెంటర్ కూడా ఇది. 2028-2032 మధ్య పూర్తవుతుంది. రాష్ట్ర GDPకు ఏటా రూ.10,518 కోట్లు అదనపు ఆదాయం వస్తుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.88 లక్షల మందికి ఉద్యోగాలు ఏర్పడతాయి. విశాఖ నగరం పూర్తిగా ‘ఏఐ సిటీ’గా మారుతుంది.
సముద్రగర్భ కేబుల్ వ్యవస్థ ద్వారా విశాఖ దక్షిణాసియా, ఆస్ట్రేలియాకు అనుసంధానమవుతుంది. మయన్మార్ మీదుగా ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టివిటీ మెరుగవుతుంది. ఏఐ వల్ల ఉద్యోగాలపై ఆందోళనలకు వైష్ణవ్ “నైపుణ్యాలు పెంచుకోండి, మరిన్ని అవకాశాలు వస్తాయి” అని భరోసా ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ‘వికసిత భారత్-2047’ లక్ష్యానికి ముందడుగుగా నిలుస్తుంది. లోకేశ్ అమెరికా పర్యటనలో కురియన్‌తో చర్చలు జరిగాయి. చంద్రబాబు “ఏపీని గ్లోబల్ టెక్ హబ్‌గా మారుస్తాం” అన్నారు. సీతారామన్ “రాష్ట్ర అభివృద్ధికి మైలురాయి” అన్నారు.


