Nara Lokesh on SKU: గత వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా బయటపెడతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. శాసనసభలో ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. అనంతపురంలోని ప్రతిష్టాత్మక శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ (ఎస్‌కేయూ)లో 2019-24 నడుమ అక్రమాలు జరిగాయని, గత వైసీపీ పాలనలో జరిగిన ఈ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కంప్యూటర్ల కొనుగోలులో దుర్వినియోగం, యూనివర్సిటీ వాహనాలను వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం, నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు, నియామకాలు, రిక్రూట్‌మెంట్‌లో రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడంపై కమిటీ వేస్తామన్నారు. వంద రోజుల్లో నివేదిక తెప్పించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో శాసనసభ్యులు ఎంఎస్ రాజు, పల్లె సింధూర రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానమిస్తూ… పారదర్శకంగా విశ్వవిద్యాలయాలు నడిపించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉందని తెలిపారు. గురువారం ఆంధ్రా యూనివర్సిటీలో ఒక విద్యార్థి ఫిట్స్‌తో చనిపోయారని.. దీనిపై కొన్ని విద్యార్థి సంఘాలు ఆందోళన చేయడం సరికాదన్నారు. ప్రభుత్వపరంగా ఎలాంటి తప్పు లేకపోయినా రాజకీయాలు చేయడం సరికాదని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా యూనివర్సిటీ వీసీలను నియమిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రా యూనివర్సిటీని దేశంలోని టాప్ 100 వర్సిటీల్లో ఒకటిగా తీర్చిదిద్దే బాధ్యతను సీఎం చంద్రబాబు తనకు అప్పగించారని గుర్తు చేశారు. కొంతమంది వారి స్వార్థం కోసం విద్యార్థులను రెచ్చగొట్టి విశ్వవిద్యాలయాల్లో గొడవలు సృష్టించడం బాధాకరమన్నారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/superstar-rajinikanth-reveals-jailer-2-release-date/
పాలిటెక్నిక్ కళాశాలలకు నూతన భవనం..
రాష్ట్రంలో భవనాలు లేని పాలిటెక్నిక్ కళాశాలలకు నూతన భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్లు మంత్రి నారా లోకేశ్ శాసనసభలో తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండు కళాశాలల భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. చోడవరం, పొన్నూరు, బేతంచర్ల, మైదుకూరు, గుంతకల్లు కాలేజీలకు భూములు కేటాయించామని.. మచిలీపట్నం, కేఆర్ పురం, అనపర్తిలో త్వరలో కేటాయిస్తామని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎంపీ లాడ్స్, సీఎస్ఆర్ నిధులను అనుసంధానించి సొంత భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. పాలిటెక్నిక్‌లలో అడ్మిషన్లు 70శాతంగా ఉన్నాయన్నారు. కన్వెన్షనల్ కోర్సులకు ఎవరూ రావడం లేదని.. వాటిని రీడిజైన్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, మంత్రి నారా లోకేష్ శుక్రవారం అసెంబ్లీలో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టారు. విద్యా శాఖకు సంబంధించి పలు బిల్లులను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రవేశపెట్టారు. బార్ కౌన్సిల్‌కు చెందిన న్యాయ విద్య, పరిశోధనకు భారత అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ బిల్లును మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వ విద్యాలయాల చట్ట సవరణతో పాటు విశ్వవిద్యాలయాల సవరణ బిల్లులను సైతం ఆయన సభలో ప్రవేశ పెట్టారు.


