Nara Lokesh| ఐటీ ఇండస్ట్రీలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అసెంబ్లీలో (AP Assembly Session) ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. మూడు నెలల్లోనే విశాఖకు టీసీఎస్(TCS) సంస్థ వస్తుందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు (Chandrababu) చొరవ వల్ల ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ఐటీ రంగంలో 20 శాతం మంది తెలుగువాళ్లు ఉండటం గర్వకారణం అని పేర్కొన్నారు.
2014 నుంచి 2019 మధ్యలో సుమారు 150 కంపెనీలు 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించాయని గుర్తుచేశారు. ఈ పరిశ్రమలను ఆనాడు ఎంతో చొరవతో రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. విశాఖకు డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చి అదానీ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. కానీ 2019లో ప్రభుత్వం మారగానే అది ఆగిపోయిందని మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదని విమర్శించారు.
గత ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పెట్టుబడుల గురించి అడిగితే కోడి.. గుడ్డు పెట్టలేదని సమాధానమిచ్చారని వాపోయారు. ఐటీ మంత్రి ఇలా ఉంటారా అంటూ ఏపీకి అవమానం జరిగిందన్నారు. తాను ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పలు కంపెనీలను కలిస్తే గత ప్రభుత్వంలో వాళ్లు వాటాలడిగారని చెప్పారని ఆరోపించారు. ఐటీ కంపెనీల్లో కూడా వాటాలడిగే పరిస్థితి తెచ్చారని ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఐటీ సంస్థలతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నామని వివరించారు.